వీసా దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. మరో ఏడాదిపాటు ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు 

వీసా దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. మరో ఏడాదిపాటు ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు 

అమెరికా వీసాలకు దరఖాస్తు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. వీసా దరఖాస్తుదారులకు వ్యక్తిగత ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు కల్పించే సౌకర్యాన్ని పొడిగించారు. అయితే ఈ ప్రయోజనం  కొంతమంది నాన్ ఇమిగ్రంట్ (వలసేతర) వీసా దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది. 2022 ఏడాది మొత్తానికి ఈ నిర్ణయం వర్తించేలా ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. తాజాగా దాన్ని 2023 డిసెంబర్‌ 31 వరకు పొడిగించారు. ఈమేరకు అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కొంతమంది నాన్ ఇమిగ్రంట్ (వలసేతర) వీసా దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలను రద్దు చేసిన నేపథ్యంలో మన దేశంలోని అమెరికా ఎంబసీలపై ఒత్తిడి చాలామేరకు తగ్గింది. దీంతో వీసా కోసం తప్పనిసరిగా ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సిన కేటగిరిలోని అభ్యర్థులకు అపాయింట్మెంట్ సమయాన్ని బాగా తగ్గించారు. ఇక ఈ నిర్ణయం వల్ల మన దేశం నుంచి అమెరికాకు వెళ్లే వృత్తి నిపుణులు, విద్యార్థులకు ఎంతో  ప్రయోజనం చేకూరనుంది. 

ఇంటర్వ్యూ మినహాయింపునకు ఎవరు అర్హులు ?

  • తాత్కాలిక వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల కార్మికులు (హెచ్ 2 వీసాలు)
  • విద్యార్థులు (ఎఫ్ వీసాలు, ఎం వీసాలు)
  • అకడమిక్ ఎక్స్ఛేంజ్ విజిటర్స్ (అకడమిక్ జే వీసాలు)
  • స్పెషలైజేషన్ కలిగిన  వృత్తి నిపుణులు (హెచ్ 1బీ వీసాలు)
  • ట్రైనీ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ విజిటర్లు (హెచ్ 3 వీసాలు)
  • కంపెనీల అంతర్గత బదిలీల్లో భాగంగా అమెరికాకు వెళ్లేవారు (ఎల్ వీసాలు)
  • ఎక్స్ ట్రాడినరీ ఎబిలిటీ కలిగిన వ్యక్తులు (ఓ వీసాలు)
  • అథ్లెట్స్, ఆర్టిస్టులు, ఎంటర్ టైనర్స్ (పీ వీసాలు)
  • అంతర్జాతీయ సాంస్కృతిక బదిలీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లేవారు (క్యూ వీసాలు)