చీకట్లో అమెరికా..పైపుల్లో నీళ్లు గడ్డ కడ్తున్నై

చీకట్లో అమెరికా..పైపుల్లో నీళ్లు గడ్డ కడ్తున్నై

వాషింగ్టన్‌ : మంచు తుఫాను కారణంగా అగ్రరాజ్యం అమెరికా  వణికిపోతోంది. భారీగా కురుస్తున్న మంచు, చలిగాలులకు ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోయాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. తుఫాను కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 15 లక్షలకుపైగా ఇళ్లు అంధకారంలో చిక్కుకున్నాయి. పైపుల్లో నీరు గడ్డకట్టడంతో వాటర్ సప్లై కూడా ఆగిపోయింది. 

యూఎస్ వెదర్ రిపోర్ట్ ప్రకారం శుక్రవారం ఉష్ణోగ్రత మైనస్ -48 డిగ్రీలకు పడిపోయింది. అమెరికావ్యాప్తంగా 20కోట్ల మందికిపైగా ప్రజలు మంచు తుఫాను ప్రభావం పడింది. హైవేలపై భారీగా మంచు పేరుకుపోవడంతో వాటిని మూసివేయడంతో జనం క్రిస్మస్‌ ప్రయాణాలు వాయిదా వేసుకోక తప్పలేదు. కరెంట్ సప్లై లేక, బయటకు వెళ్లలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

అమెరికాలో శుక్రవారం ఒక్కరోజే 5వేల విమానాలు  రద్దయ్యాయి. మరో 7600 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఒహియోలో మంచు తుపాను కారణంగా 50 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మిచిగాన్‌లోనూ 9 ట్రాక్టర్లు ఢీకొని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మంచు ప్రభావం ఎక్కువగా ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.