- రాణించిన హర్మీత్, రంజనే,
చెన్నై: వరుసగా రెండు పరాజయాలతో టీ20 వరల్డ్ కప్‌ను ప్రారంభించిన అమెరికా ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. బ్యాటింగ్‌లో తెలుగు కుర్రాడు ముక్కమల్ల సాయితేజ (51 బాల్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 79), శుభమ్ రంజనే (24 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 నాటౌట్), బౌలింగ్‌లో హర్మీత్ సింగ్ (4/21) విజృంభించడంతో శుక్రవారం చెపాక్ స్టేడియంలో జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్‌లో 93 రన్స్ తేడాతో నెదర్లాండ్స్‌పై గ్రాండ్ విక్టరీ సాధించింది. మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక రన్స్ తేడాతో గెలిచిన ఐసీసీ అసోసియేట్ టీమ్‌గా అమెరికా రికార్డుకెక్కింది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో డచ్ టీమ్‌తో గతంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఓడిన యూఎస్ ఎట్టకేలకు తొలి విజయం అందుకుంది.
ఈ వన్‌సైడ్ మ్యాచ్‌లో తొలుత యూఎస్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 196/6 భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు మోనాంక్ పటేల్ (36), జహంగీర్ (20) ఆకట్టుకోగా.. సాయితేజ, రంజనే భారీ షాట్లతో డచ్ బౌలర్లపై విరుచుపడ్డారు. ప్రత్యర్థి బౌలర్లలో బాస్ డి లిడే (3/37) మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేజింగ్‌లో డచ్ టీమ్ 15.5 ఓవర్లలోనే 103 రన్స్‌కు ఆలౌటై చిత్తుగా ఓడిపోయింది. హర్మీత్‌కు తోడు షాడ్లీ వాన్ షాల్క్‌విక్ (3/21), మొహమ్మద్ మోసిన్ (2/19) దెబ్బకు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు డీలా పడింది. బాస్ డి లిడే (23), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (20) తప్ప మిగతా వాళ్లు ఫెయిలయ్యారు. డచ్ టీమ్‌లో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. హర్మీత్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
