ఇండో-చైనా సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దు

ఇండో-చైనా సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దు

వాషింగ్టన్: ఇండియా, చైనా సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దంటూ అమెరికన్ అధికారులకు చైనా వార్నింగ్ ఇచ్చిందని ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. రెండేండ్ల కిందట గల్వాన్ లోయలో ఇండియా, చైనా ఆర్మీల మధ్య ఘర్షణ తర్వాత.. అమెరికాకు ఇండియా దగ్గరయిందని, దీంతో చైనా దిగొచ్చిందని తెలిపింది. చైనీస్ మిలిటరీ అంశంపై మంగళవారం అమెరికన్ కాంగ్రెస్​కు ఆ దేశ రక్షణ శాఖ కార్యాలయం నివేదికను సమర్పించింది. 2021 ఏడాదంతా బార్డర్ వెంబడి చైనీస్ ఆర్మీ నిర్మాణాలు, బలగాల మోహరింపును కొనసాగించిందని, దీంతో చర్చలతో పెద్దగా ఫలితం లేకపోయిందని తెలిపింది. మీరే ఆక్రమణలు చేశారంటే.. మీరే చేశారని ఇండియా, చైనా ఆరోపణలు చేసుకున్నాయని చెప్పింది. అయితే, అమెరికాకు ఇండియా దగ్గరవుతూ వస్తుండటంతో బార్డర్ గొడవలను నివారించేందుకు, ఇండియాతో సంబంధాలు దెబ్బతినకుండా చూసేందుకు చైనా చర్యలు తీసుకున్నట్లు రక్షణ శాఖ వివరించింది.  

చైనా వద్ద 400 అణుబాంబులు

చైనా తన అణ్వస్త్రాల సంఖ్యను ఏటా పెంచుకుం టూ పోతోందని అమెరికా రక్షణ శాఖ తన నివేదికలో తెలిపింది. ప్రస్తుతం చైనా వద్ద 400 న్యూక్లియర్ వార్ హెడ్లు ఉన్నాయని, 2035 నాటికి వాటి సంఖ్య 1500కు చేరనుందని వెల్లడించింది. వచ్చే దశాబ్ద కాలంలో చైనా తన న్యూక్లియర్ ఫోర్సెస్ ను ఆధునీకరించడంతో పాటు మరింతగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా నేల, సముద్రం, నింగి ద్వారా అణుబాంబులను ప్రయోగించే ప్లాట్ ఫాంలను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఆధునీకరిస్తోందని పేర్కొంది.