మంచిగా పనిచేసిన సెంటర్లు ఒక్కొక్కటిగా మాయమైతున్నయ్

మంచిగా పనిచేసిన సెంటర్లు ఒక్కొక్కటిగా మాయమైతున్నయ్

హైదరాబాద్, వెలుగు: అన్నార్థుల ఆకలి తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో గ్రేటర్​ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ‘ఫీడ్​ద నీడ్’ సెంటర్లు నిరుపయోగంగా మారాయి. గతంలో మొత్తం 36 చోట్ల ఫ్రిజ్​లు ఏర్పాటు చేయగా ఎక్కడా వాటి సేవలు అందడం లేదు. గతేడాది వరకు మంచిగా పనిచేసిన సెంటర్లు ఒక్కొక్కటిగా మాయం అవుతున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల ఫ్రిజ్​​లు కనిపించడం లేదు. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతోనే ఈ సెంటర్లు మూతపడ్డాయని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో నిర్వహణ ఆగిపోయింది. కొన్నిచోట్ల ఫ్రిజ్​​లు చోరీకి గురయ్యాయి.

100 మంది ఆకలి తీర్చేలా..

యాపిల్ హోమ్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతిరోజు ఒక్కో సెంటర్ ద్వారా దాదాపు100 మందికి భోజనం లభించేలా జీహెచ్ఎంసీ భాగస్వామ్యంతో 36 ‘ఫీడ్ ద నీడ్’ సెంటర్లను ఏర్పాటు చేసింది. స్థలం కేటాయించి ఆర్భాటంగా ప్రారంభించిన జీహెచ్ఎంసీ అధికారులు తర్వాత వాటి నిర్వహణను పట్టించుకోవడం మానేశారు. మరికొన్ని సెంటర్లు ఏర్పాటు చేద్దామనుకున్న సంస్థకు బల్దియా సహకారం లేకపోవడంతో వెనక్కి తగ్గింది. ముందు ఏర్పాటు చేసిన వాటి నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో ‘ఫీడ్ ద నీడ్’ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. యాపిల్​సంస్థ ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో సెంటర్లను ఏర్పాటు చేసింది. అక్కడి అధికారులు సౌకర్యాలు కల్పిస్తుండటంతో నియోజకవర్గానికి 2 చొప్పున ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది.

ఒక్కటీ పనిచేయట్లే.. 

సిటీలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆటో స్టాండ్లు, నైట్ షెల్టర్లు, మురికివాడలు, హాస్పిటళ్లతోపాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో 36 ‘ఫీడ్ ద నీడ్’ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతిచోట ఒక ఫ్రిజ్​ అందుబాటులో ఉంచారు. హోటళ్లు, హాస్టళ్లు, కంపెనీలు, ఇండ్లలో మిగిలిని ఆహారాన్ని బయట పారబోయకుండా ఈ సెంటర్లలో తీసుకొచ్చి పెడితే ఆకలిగా ఉన్నవారు ఎవరైనా తినొచ్చు. ఇలా మొదట్లో ‘ఫీడ్​ద నీడ్’ సెంటర్ల ద్వారా డైలీ వందలాది మంది ఆకలి తీరేది. కానీ ప్రస్తుతం ఈ సెంటర్లు పూర్తిగా మూతపడ్డాయి. ఇందుకు ప్రధాన కారణం కరెంట్​సరఫరా నిలిచిపోవడమే. ఫలితంగా ఫ్రిజ్​ లు పనిచేయడంలేదు. దీంతో సెంటర్లు అధ్వానంగా మారాయి. ఒక్క ఫ్రిజ్​ ​కూడా పనిచేయడం లేదు. మెహిదీపట్నంలోని సరోజిని దేవి హాస్పిటల్​పక్కన ఏర్పాటు చేసిన సెంటర్​లో 3 నెలల క్రితం ఫ్రిజ్​ మాయం కాగా, 20 రోజుల క్రితం పూర్తిగా సెంటర్ నే లేపేశారు. ఈ విషయంపై సంబంధిత జీహెచ్ఎంసీ ఆఫీసర్ ని అడిగితే తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చారు. ఇదే విషయంపై అడిషనల్ కమిషనర్ సంతోశ్​ని వివరణ కోరగా ‘ఫీడ్ ద నీడ్’ సెంటర్లు పనిచేయడం లేదని తెలిపారు. 

సహకారం లేకనే ఏపీలో పెట్టాం

అన్నార్థుల ఆకలి తీర్చేందుకు మేం ఏర్పాటు చేసిన ‘ఫీడ్ ద నీడ్’ సెంటర్లు మూతపడటం బాధగా ఉంది. జీహెచ్ఎంసీ సపోర్ట్ లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. ముందు చెప్పిన విధంగా బల్దియా అధికారులు సహకరించకపోవడంతో సెంటర్లు నిరుపయోగంగా మారాయి. కొన్నిచోట్ల సెంటర్లే కనిపించడం లేదు. మెయిన్​గా పవర్ సప్లై ఉండడం లేదు. ముందు పెట్టినవి సక్రమంగా నడిస్తే సిటీలో 300వరకు ఏర్పాటు చేయాలని అనుకున్నాం. అందుకు ప్రభుత్వ సహకారం కోరితే పట్టించుకోలేదు. దీంతో ఏపీలో సెంటర్లు ఏర్పాటు చేస్తున్నం. అక్కడ ప్రభుత్వం, అధికారుల సపోర్ట్ బాగుంది. ఇప్పటికైనా ఈ సెంటర్ల విషయంపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్, మేయర్ విజయలక్ష్మి అవకాశం ఇవ్వాలి.‌‌‌‌ - డాక్టర్ నీలిమా ఆర్య, యాపిల్ హోం ఫౌండర్, ప్రెసిడెంట్