
మనుషుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతుంది ఈ రోజుల్లో. ఎప్పుడు ఎక్కడ ఎవరు కుప్పకూలుతారో అంచనా కూడా వేయలేని పరిస్థితి. దిట్టంగా, ఆరోగ్యంగా కనిపించే యువకులు కూడా పిట్టల్లా నేల రాలుతున్నారు. తినే తిండి.. వాడే పనిముట్లే అందుకు కారణం.
ఆహార పదార్థా్ల్లో కెమికల్స్ వినియోగం, క్రిమిసంహారక మందులు, ప్రెసర్వేటివ్స్, టేస్టింగ్ ఇంగ్రీడియెంట్స్, కలరింగ్ ఏజెంట్స్, కల్తీ నూనెలు.. మొదలైన సవాలక్ష కారణాల చేత ప్రజల ఆరోగ్యం దెబ్బతింటూనే ఉంది. అయితే ఆహార పదార్థాలతో పాటు మనం వాడుతున్న వంట పాత్రలు కూడా ప్రాణాలు తీస్తాయట.ఒక ఇండియన్ కంపెనీ తయారు చేస్తున్న వంట పాత్రలు ప్రాణాలకే ముప్పు అని అమెరికా ప్రకటించింది.
చేసే వంట రుచి అనే వాడే పాత్రపైన ఆధారపడి ఉంటుంది. అందుకోసం ఎంత ఖర్చు చేసి అయినా క్వాలిటీ పాత్రలను కొంటున్నారు జనాలు. అయితే కొన్ని పాత్రలు న్యూట్రిషనల్ వ్యాల్యూస్ ను నాశనం చేయగా.. మరికొన్ని కెమికల్స్ రిలీజ్ చేసి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం.. సరస్వతి స్ట్రిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Saraswati Strips Pvt. Ltd) అనే కంపెనీ తయారు చేసే వంట పాత్రల వలన తీవ్రమైన రోగాలు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ కంపెనీ పాత్రలు వంటల్లోకి విషపూరితమైన లెడ్ ను రిలీజ్ చేస్తున్నాయట.
యూఎస్ హెల్త్ రెగ్యూలేటర్ చెప్పిన వివరాల ప్రకారం.. టైగర్ వైట్.. ప్యూర్ అల్యూమినియం యుటెన్సిల్స్.. అనే బ్రాండ్ పేరున కంపెనీ పాత్రలను మార్కెటింగ్ చేస్తోంది. ఏజెన్సీ ప్రకారం.. అల్యూమినియం, బ్రాస్, అల్యూమినియం మిశ్రమ లోహాల ద్వారా తయారు చేసిన పాత్రల నుంచి వంట చేసినప్పుడు లెడ్ ఆహారంలో కలుస్తుందని తెలిపింది. వీటితో పాటు హిందాలియం, హిందోలియం, ఇండాలియం, ఇండోలియం పేర్లతో ఇంపోర్ట్ చేసుకున్న పాత్రల్లో కూడా లెడ్ ఉత్పత్తి అవుతున్నట్లు FDA ప్రకటించింది.
అల్యూమీనియం పాత్రల వాడకంపై ఇప్పటికే పెద్ద క్యాంపెయిన్ మొదలైంది. డాక్టర్లు, సైంటిస్టులు, మేధావులు.. అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం ప్రాణాంతకమని ప్రచారం చేస్తున్నారు. కొందరికి అవగాహన పెరిగింది కూడా. వీటికి బదులు స్టీల్ పాత్రలు వినియోగించడం సేఫ్ అని కొందరు స్టీల్ వినియోగిస్తున్నారు. మరికొందరు ఎందుకొచ్చిన గొడవ అని మట్టి పాత్రలను వినియోగిస్తున్నారు. మట్టి పాత్రలు వాడకం వలన ఎలాంటి నష్టం లేదని వాడుతున్నారు.