హైదరాబాద్, వెలుగు: డెలివరీ టైంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి.. తీవ్ర అనారోగ్య సమస్యలతో శిశువు జన్మించేందుకు కారణమైన హాస్పిటల్ పై.. హైదరాబాద్ కన్జూమర్ ఫోరం–2, రూ.60 లక్షల ఫైన్ వేసింది. కోర్టు ఖర్చుల కింద మరో రూ.20 వేలు బాధితులకు చెల్లించాలని ఫోరం ప్రెసిడెంట్ వక్కంటి నర్సింహారావు, మెంబర్ జవహర్ బాబు ఆదేశించారు. తీర్పు వివరాలు ఇలా ఉన్నాయి.. నాగర్ కర్నూల్ జిల్లా రాచాలపల్లికి చెందిన పెద్దగళ్ల శిరీష ఆరో నెల నుంచి హైదర్ గూడ ఫెర్నాండేజ్ హాస్పిటల్లోని డాక్టర్ గీత కోలార్ వద్ద చెకప్ కు వెళ్లింది. ఫస్ట్ డెలివరీ సిజేరియన్ అయ్యిందని ముందే చెప్పింది. 2019, ఫిబ్రవరి 14న డెలివరీ కోసం రూ.50వేలు అడ్వాన్స్ గా పే చేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. తానే డెలివరి చేస్తానని శిరీషకు డాక్టర్ గీత హామీ ఇచ్చి.. ఆ టైంకు రాలేదు. దీంతో డాక్టర్లు సుభాషిణి, వీణ కలిసి డెలివరీ చేయడానికి రెడీ అయ్యారు. నార్మల్ డెలివరీ కోసం ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. అయినా నార్మల్ డెలివరీ కాకపోవడంతో ఫిబ్రవరి 15న తెల్లవారుజామున 3 గంటలకు సిజేరియన్ డెలివరీ చేశారు. ఆ సమయంలో ఫస్ట్ సిజేరియన్ కుట్లు విడిపోవడంతో శిరీష విపరీతమైన వెన్నునొప్పితో బాధపడింది. పాపకు ఆక్సిజన్ అందలేదు. అనేక అనారోగ్య సమస్యలు బయటపడ్డాయి. 46 రోజులు పాపను హాస్పిటల్లోనే ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ టైంలో రూ.76వేలు ఖర్చు చేశారు. పాప ఎదుగుదల విషయంలో అనేక లోపాలు ట్రీట్మెంట్ టైంలో డాక్టర్లు గుర్తించారు. బిడ్డను చూసుకునేందుకు తల్లి శిరీష ఉద్యోగం మానేసుకుంది. ఇప్పుడు కూడా పాప వైద్యం కోసం రూ.60వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. హాస్పిటల్ యాజమాన్యాన్ని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో 2020 అక్టోబర్ 8న బాధితులు హైదరాబాద్ కన్జుమర్ ఫోరం–2ను ఆశ్రయించారు.
నార్మల్ డెలివరీకి ఆక్సిటోసిన్ వినియోగం
తమ లోపం ఏమీ లేదని, పేషంట్ ఇష్టప్రకారమే నార్మల్ డెలివరీకి ట్రై చేశామని విచారణ సమయంలో వైద్యులు తెలిపారు. తమ వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా వాదించింది. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ గేదెలు, ఆవులలో పాల ఉత్పత్తి పెంచడానికి కూడా ఇస్తారని, ఇప్పుడు నార్మల్ డెలివరీ కోసం కూడా ఇస్తున్నారని డ్యూటీ డాక్టర్లు బెంచ్ ముందు వెల్లడించారు. మోతాదులోనే ఉపయోగిస్తామని చెప్పారు. ఇరువైపు వాదనలు విన్న ఫోరం.. ట్రీట్మెంట్, మెడికల్ రిపోర్టులను పరిశీలించింది. ట్రీట్మెంట్ టైంలో వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, బాధితులకు రూ.60లక్షల పరిహారం, ఫిర్యాదు ఖర్చులకు మరో రూ.20వేలు ఇవ్వాలని ఫెర్నాండెజ్ హాస్పిటల్ మేనేజ్ మెంట్ ను ఆదేశించింది.
