
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు చెందిన ప్రముఖ కర్నాటక సంగీత కళాకారిణి శ్వేతాప్రసాద్‌కు ప్రతిష్టాత్మక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్యువ పురస్కారం –2022 లభించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ బుధవారం ఢిల్లీలో అవార్డులను ప్రకటించింది. సంగీత విభాగంలో తెలంగాణ నుంచి శ్వేతాప్రసాద్‌కు కర్నాటక మ్యూజిక్‌లో ఈ అవార్డ్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా శ్వేతాప్రసాద్ మూడు దశాబ్దాలుగా రెండువేలకు పైగా సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. అన్నమాచార్య కృతులు, త్యాగరాజ కీర్తనలను పాడారు.
దేశవిదేశాల్లోనూ భరతనాట్యం, ఆంధ్రనాట్యం, కూచిపూడి విభాగాల్లో ప్రముఖ నాట్య కళాకారులకు గాత్ర సహకారం అందించారు. పలు నృత్య ప్రదర్శనలకు స్వరకల్పన కూడా చేశారు. అమెరికా, చైనా, మలేషియా, టర్కీ, సిరియా, వియత్నాం దేశాల్లో భారత సాంస్కృతిక మండలి తరఫున నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. కర్నాటక సంగీతం, లైట్మ్యూజిక్లో ఆకాశవాణి ‘ఏ’ గ్రేడ్ కళాకారిణి అయిన శ్వేతాప్రసాద్ ప్రముఖ సినీ నటుడు రక్తకన్నీరు నాగభూషణం మనువరాలు. శ్వేతాప్రసాద్ ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్ చేస్తున్నారు.