ఇద్దరూ కలసి ప్రజలని మోసం చేస్తున్నారు: ఉత్తమ్

ఇద్దరూ కలసి ప్రజలని మోసం చేస్తున్నారు: ఉత్తమ్

సీఎల్పీని టీఆర్ఎస్ లోనికి విలీనం చేయడంపై కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసన దీక్షను ఆమరణ నిరహార దీక్షగా ప్రకటించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి .తమ డిమాండ్స్ తీర్చే వరకు ఈ అమరణ నిరహార దీక్ష కొనసాగుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్  ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారన్నారు. ముఖ్యమంత్రి, స్పీకర్ కలసి తెలంగాణ ప్రజలని మోసం చేస్తున్నారన్నారు. వీరి మోసం వల్ల కాంగ్రెస్ కంటే రాష్ట్ర ప్రజలకే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.

స్పీకర్ పదివిలో ఉన్న వ్యక్తి ఇలా పక్షపాతం వ్యవహరిస్తారని తాము అనుకోలేదన్నారు ఉత్తమ్. తాము స్పీకర్ పర్సనల్ ఫోన్ కి ఫోన్ చేసినా స్పందించలేదని…కానీ అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకు మాత్రం 3 గంటలకు రహస్య ప్రదేశంలో సమయమిచ్చారన్నారు.

ప్రతిపక్షం లేకుండా చేస్తే ఏ సమస్యలపైనా ప్రశ్నించేవారు ఉండరని కేసీఆర్ ఈ దుర్మార్గానికి పాల్పతున్నారని అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నించేవారు లేకుండా చేయడమే టీఆర్ఎస్ లక్ష్యంగా ఎమ్మెల్యేలని కొంటున్నారని ఉత్తమ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ని అణచివేయాలని చూస్తే వారి ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. ఊపిరి ఉన్నంతవరకు కాంగ్రెస్ లోనే ఉంటామని ఆయన అన్నారు .

ఇంటర్మీడియేట్ , రైతుల సమస్యలు ఇలా ఏ ప్రజా సమస్యపైనా సీఎం స్పందించకుండా..  మా ఎమ్మెల్యేలని కొనే పనిలోనే  లీనమైయ్యారని ఉత్తమ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన ఎంఐఎం, వైసీపీ అంటేనే కేసీఆర్ కి ముద్దు  అని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకి నచ్చదని ఆయన అన్నారు.

కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ప్రతి ఒక్కరూ అమరణ నిరహార దీక్ష  ప్రాంగణానికి వచ్చి భట్టి విక్రమార్క కి సంఘీభావం తెలపాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు.