టీఎస్​పీఎస్సీలో అవినీతి15 పేపర్లు లీకవుడేంది?: ఉత్తమ్

టీఎస్​పీఎస్సీలో అవినీతి15 పేపర్లు లీకవుడేంది?: ఉత్తమ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, కానీ, ఆ ఆకాంక్షలు నెరవేరలేదని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. టీఎస్‌‌‌‌పీఎస్సీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లోనే  లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని, మొత్తంగా 40 లక్షల మంది నిరుద్యోగులున్నారని పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీ భవన్‌‌‌‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జి మాణిక్ రావ్‌‌‌‌ ఠాక్రేతో కలిసి మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి.. ఊరికొకటి కూడా ఇవ్వలేదన్నారు. 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో చెప్పినా కేసీఆర్‌‌‌‌‌‌‌‌.. ఒక్క పోస్టునూ నింపలేదని ఆరోపించారు. దేశ చరిత్రలోనే లేని విధంగా టీఎస్‌‌‌‌పీఎస్సీ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. 15 క్వశ్చన్ పేపర్లు లీకయ్యాయంటేనే కమిషన్ అసమర్థత అర్థమవుతున్నదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోనే నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. -11 ప్రభుత్వ యూనివర్సిటీలను గాలికొదిలేసిన సర్కారు.. కావాల్సిన వారికి మాత్రం ప్రైవేటు యూనివర్సిటీలకు పర్మిషన్లను ఇచ్చిందని ఫైర్ అయ్యారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ బకాయిలనూ చెల్లించడం లేదని విమర్శించారు. బకాయిలను చెల్లించాలంటూ హైకోర్టు చెప్పినా సర్కారు పట్టించుకోవట్లేదని ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. 

ప్రజలకు ఒరిగిందేమీ లేదు: ఠాక్రే

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, కేసీఆర్ సర్కారు ఇచ్చిన హామీని నిలుపుకోలేదని మాణిక్​రావ్ ఠాక్రే విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాల భర్తీని ఎలా చేపడతామో ప్రియాంకా గాంధీ సభలో వివరిస్తామని చెప్పారు. సభలోనే నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు. సభకు యువత భారీగా రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ ఎంపీలు కూడా పోరాడారని గుర్తుచేశారు. తెలంగాణ ఇస్తే పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.. యువతను దృష్టిలో పెట్టుకుని సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. తొమ్మిదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఫైర్ అయ్యారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్​తదితరులు పాల్గొన్నారు.

ప్రియాంక టూర్‌‌‌‌‌‌‌‌లో పాదయాత్ర రద్దు

ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. సోమవారం మధ్యాహ్నం 3.30కు ఆమె నేరుగా ఎల్బీ నగర్‌‌‌‌‌‌‌‌లోని శ్రీకాంతాచారి విగ్రహం వద్దకు చేరుకుని నివాళి అర్పిస్తారని, తర్వాత సరూర్​నగర్ గ్రౌండ్‌‌‌‌కు చేరుకుంటారని పార్టీ నేతలు తెలిపారు. వాస్తవానికి శ్రీకాంతా చారి విగ్రహం నుంచి సరూర్‌‌‌‌‌‌‌‌నగర్ గ్రౌండ్ వరకు పాదయాత్రగా వెళ్లాల్సి ఉన్నా.. సమయం లేకపోవడంతో దానిని రద్దు చేసినట్టు చెప్పారు. గాంధీ భవన్‌‌‌‌లో ప్రియాంకా గాంధీ టూర్‌‌‌‌‌‌‌‌పై మాణిక్ రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి సహా పలువురు కీలక నేతలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.