
- మూడు బ్యారేజీల డిజైన్లలోనే లోపాలున్నయ్
- ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది
- వారంలో ఎన్డీఎస్‌ఏ, 10 రోజుల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు వస్తది
- వాటి ఆధారంగానే ముందుకు వెళ్తం
- కొత్తగా 30 లక్షల రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు నింపితే అది మొత్తం కొట్టుకుపోయి, దాని కింద ఉన్న ఊర్లు కూడా మునిగిపోయే ప్రమాదముందని నేషనల్డ్యామ్సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తేల్చి చెప్పిందని ఇరిగేషన్, సివిల్ సప్లయ్స్శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీళ్లు నింపాలని తాము సర్టిఫై చేయలేమని, నీళ్లు నింపుకున్నాక ఏమైనా జరిగితే తమ బాధ్యత కాదంటూ ఎన్డీఎస్ఏ హెచ్చరించిందని చెప్పారు. ‘‘మేడిగడ్డలో ఒక్క పిల్లరే కదా కుంగిందంటూ ప్రతిపక్ష సభ్యులు పదేపదే అంటున్నారు. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లే ప్రధాన లోపమని విజిలెన్స్రిపోర్టు, ఎన్డీఎస్ఏ ప్రాథమిక రిపోర్టు తేల్చి చెప్పాయి. ఫౌండేషన్ టెక్నాలజీ కూడా పెద్ద లోపమేనని పేర్కొన్నాయి” అని చెప్పారు. ‘‘తొలుత షీట్‌పైల్స్ టెక్నాలజీని సూచించినా.. ఎక్కడా లేనిది సీకెంట్పైల్స్టెక్నాలజీని వాడారు. మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదంపై ఇప్పటికే విజిలెన్స్రిపోర్టు వచ్చింది.
మరో వారంలో ఎన్డీఎస్ఏ రిపోర్టు వస్తుంది. జ్యుడీషియల్కమిషన్రిపోర్టు కూడా వారం పది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఆ రిపోర్టుల ఆధారంగానే ముందుకు వెళ్తాం” అని ఉత్తమ్ స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో ఇరిగేషన్‌శాఖ పద్దులపై ఉత్తమ్ రిప్లై ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం చేసిన అప్పులకే ఏటా రూ.16 వేల కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గానికి 2 టీఎంసీల నీటిని విడుదల చేయాలన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చనాకా కొరాట ప్రాజెక్టును ప్రాధాన్య జాబితాలో చేర్చి పూర్తి చేస్తామన్నారు. రేలంపాడు రిజర్వాయర్‌ను 4 టీఎంసీలకు పెంచేందుకు, గూడెందొడ్డి రిజర్వాయర్‌నిర్మాణానికి డీపీఆర్‌లను తయారు చేస్తున్నామన్నారు.
కృష్ణా నీళ్లలో అన్యాయం..
పదేండ్లలో ఇరిగేషన్ శాఖ అస్తవ్యస్తమైందని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఈ శాఖలో పదేండ్లలో రూ.లక్షల కోట్ల అప్పు మిగిలిందన్నారు. ‘‘పెండింగ్బిల్లులు రూ.14 వేల కోట్లు ఉన్నాయి. కొత్త నియామకాలూ చేపట్టలేదు. ప్రాజెక్టుల పనులూ పూర్తి కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్లే కట్టారు. వాళ్ల హయాంలోనే అది కూలిపోయింది. రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాల ఆయకట్టూ రాలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.27,500 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరానికీ నీళ్లు ఇవ్వలేదు. సీతారామ ప్రాజెక్టుకు రూ.8000 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకర ఆయకట్టుకూ నీళ్లు రాలేదు. గత పదేండ్లలో నెట్టెంపాడు, దేవాదుల, రాజీవ్ భీమా, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి వంటి ప్రాజెక్టులను పెండింగ్ పెట్టారు. కృష్ణా జలాల కేటాయింపుల విషయంలో గత బీఆర్ఎస్హయాంలోనే తీవ్ర అన్యాయం జరిగింది. గంపగుత్త కేటాయింపుల్లోని 811 టీఎంసీల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకున్నది గత ప్రభుత్వ పెద్దలే. బీఆర్ఎస్హయాంలోనే కృష్ణా నుంచి అక్రమంగా నీటిని తరలించుకుపోయే ప్రాజెక్టులను ఏపీ చేపట్టింది” అని అన్నారు.
ప్రతి గింజను కొంటం..
వానాకాలంలో 153 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఉత్తమ్ తెలిపారు. అయితే హరీశ్‌రావు జోక్యం చేసుకుని.. ధాన్యం కొనుగోళ్లు సరిగా జరగలేదన్నారు. దీనిపై ఉత్తమ్ స్పందిస్తూ.. ‘‘కొనుగోళ్ల సెంటర్లకు వచ్చిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేసింది. సన్న వడ్లకు బోనస్ కూడా ఇచ్చాం. మద్దతు ధర రూ.2,300, బోనస్ రూ.500 కలిపి క్వింటాల్‌కు రూ.2,800 ధర వచ్చింది” అని చెప్పారు. ‘‘ఈ ధాన్యమంతా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే వచ్చిందంటూ మీరు (బీఆర్ఎస్) పదేపదే అబద్ధాలు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. దాని నుంచి ప్రయోజనమేమీ లేదు. పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలు చెప్పడంలో బీఆర్ఎస్వాళ్లు జోసెఫ్గోబెల్స్ను మించిపోయారు. మేడిగడ్డ కుంగిపోయి.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు వినియోగంలో లేకపోయినా 67 లక్షల ఎకరాల్లో 153 లక్షల టన్నుల ధాన్యం పండింది. బీఆర్ఎస్‌ది తప్పుడు ప్రచారమని అందరికీ తెలిసిపోయింది’’ అని అన్నారు.
తుమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి కూడా ఎత్తలే..
తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీ స్థలాన్ని ఎందుకు మార్చారో ఇప్పటికీ స్పష్టత లేదు. గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవన్న సాకును చూపించి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి రూ.లక్షన్నర కోట్లకు పెంచింది. రన్నింగ్ కాస్ట్కూడా రూ.18 వేల కోట్లకు పెరిగింది. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవంటూ సీడబ్ల్యూసీ చెప్పిందంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. కానీ, తాము అలా ఎప్పుడూ చెప్పలేదని సీడబ్ల్యూసీ క్లియర్‌గా చెప్పింది. తుమ్మిడిహెట్టి దగ్గర కూడా బ్యారేజీ నిర్మిస్తామని చెప్పిన గత సర్కారు.. తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను తీసుకురాలేక పోయారు. టెలీమెట్రీల విషయం లోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించింది.
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీపీఎల్ వాళ్లకు మూడు రంగుల కార్డు..
కొత్తగా 30 లక్షల రేషన్ కార్డులు ఇస్తామని ఉత్తమ్ ప్రకటించారు. బీపీఎల్ (బిలో పావర్టీ లైన్) కుటుంబాలకు మూడు రంగుల కార్డు, ఏపీఎల్(ఎబోవ్పావర్టీ లైన్) వాళ్లకు గ్రీన్‌కార్డు ఇస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలుపెట్టామన్నారు. ‘‘2014లో రాష్ట్రంలో 89.5 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. లబ్ధిదారులు 2.81 కోట్లు. గత పదేండ్లలో బీఆర్ఎస్ కేవలం 47 వేల కార్డులే కొత్తగా ఇచ్చింది. ప్రస్తుతం రేషన్‌షాపుల ద్వారా ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని ఎవరూ తినడం లేదు. అవన్నీ అమ్ముకుంటున్నారు. అందుకే ఉగాది నుంచి సన్న బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రేషన్ డీలర్ల కమీషన్ గతంలోనే పెంచాం. ఇప్పుడు పెంచే ఆలోచనైతే లేదు. అయితే రేషన్‌డీలర్లు షాపులో ఇతర వస్తువులను పెట్టుకుని, దాన్ని విస్తరించుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించాం. బియ్యంతో పాటు ఇతర సరుకులనూ రేషన్‌లో చేర్చేందుకు సీఎంతో చర్చించాం. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించాం. సన్నొడ్లకు రూ.1,199 కోట్ల బోనస్ చెల్లించాం. మరో రూ.37 కోట్లు పెండింగ్‌లో ఉంది” అని తెలిపారు.