కాళేశ్వరం అప్పులన్నీ కేసీఆర్, కేటీఆరే కట్టాలి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాళేశ్వరం అప్పులన్నీ  కేసీఆర్, కేటీఆరే కట్టాలి : ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ప్రజలపై లక్ష కోట్ల భారం మోపారు: ఉత్తమ్
  • ప్రాజెక్టుకు అన్ని అనుమతులు లేకున్నా బీజేపీ అండతోనే లోన్లు వచ్చినయ్​
  • విజిలెన్స్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటం   
  • ఎల్అండ్​టీకి రూ.400 కోట్ల బిల్లులు ఆపినం
  • మేడిగడ్డను బొందలగడ్డ అన్నోళ్లు.. ఇప్పుడు అక్కడికి ఎందుకెళ్లినట్టు?
  • బ్యారేజీ కుంగుబాటుపై ప్రజలకు బీఆర్ఎస్ నేతలు 
  • క్షమాపణలు చెప్పాలని డిమాండ్  

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజలపై రూ.లక్ష కోట్ల భారం మోపిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం అప్పులన్నీ కేసీఆర్, కేటీఆరే కట్టాలని అన్నారు. శుక్రవారం సెక్రటేరియెట్​లో మీడియాతో ఉత్తమ్ చిట్ ​చాట్​ చేశారు. కేసీఆర్​ కుటుంబం కాళేశ్వరం పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నదని, మళ్లీ ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నదని ఆయన అన్నారు.

‘‘కమీషన్లకు కక్కుర్తి పడే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును షిఫ్ట్​చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదు కాబట్టే మేడిగడ్డకు మార్చామని చెప్పడం వెనుక కుట్ర దాగుంది. కాళేశ్వరం నిర్మాణ వ్యయం ఇప్పటికే రూ.1.50 లక్షల కోట్లకు చేరింది. అది పూర్తయ్యే వరకు ఇంకెంత పెరుగుతుందో. 

ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అన్ని అనుమతులు ఇవ్వకుండానే కేంద్ర ఆర్థిక సంస్థలు, బ్యాంకులు లక్ష కోట్ల లోన్లు ఇచ్చాయంటే బీఆర్ఎస్, బీజేపీ మధ్య సంబంధం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు” అని అన్నారు. ‘‘తుమ్మిడిహెట్టి వద్ద గతంలో పెట్టిన ఖర్చుకు ఇంకో రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందేవి. కానీ కాంగ్రెస్ కు క్రెడిట్​వస్తుందని కేసీఆర్​రీడిజైన్​కు తెరతీశారు. రీడిజైన్​ పేరుతో ప్రజలపై అప్పుల భారం మోపారు” అనిఅన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని మేనిఫెస్టోలో చెప్పామని, అది చేపట్టి తీరుతామని పేర్కొన్నారు.  

ఎక్స్ పర్ట్ కమిటీకి సహకరిస్తం.. 

మేడిగడ్డపై విజిలెన్స్ తుది నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ తెలిపారు. ఇప్పటికే రామగుండం ఈఎన్సీని టర్మినేట్​చేశామని పేర్కొన్నారు. ‘‘విజిలెన్స్​ తుది నివేదికలో బ్యారేజీ కుంగడానికి బాధ్యులెవరో పేర్లతో సహా వెల్లడిస్తాం. ఒకట్రెండు రోజుల్లోనే ఆ నివేదిక అందుతుంది. దాని ఆధారంగా బాధ్యులైన అధికారులు, ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటాం” అని వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాక్​ను సబ్​కాంట్రాక్టర్​నిర్మించినట్టుగా డాక్యుమెంట్లలో ఎక్కడా లేదని చెప్పారు. 

నిర్మాణ సంస్థ ఎల్అండ్ టీకి చెల్లించాల్సిన రూ.400 కోట్ల బిల్లులను ఆపామని తెలిపారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్​చంద్రశేఖర్ ​అయ్యర్​ నేతృత్వంలో కేంద్రం ఎక్స్ పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. శనివారం ఢిల్లీకి వెళ్లి సీడబ్ల్యూసీ అధికారులతో పాటు నేషనల్​డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఎక్స్​పర్ట్​కమిటీతో సమావేశమవుతాం. నెల రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని కమిటీకి విజ్ఞప్తి చేస్తాం” అని చెప్పారు. ఎన్డీఎస్ఏ ఎక్స్​పర్ట్​కమిటీకి​రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. 

లేని డాక్యుమెంట్లు ఎట్లిస్తం? 

మేడిగడ్డపై గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ​ప్రభుత్వం కూడా ఎన్డీఎస్ఏ కోరిన డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సలహాదారు అనడం సరికాదని ఉత్తమ్ అన్నారు. ‘‘పోయినేడాది అక్టోబర్​21న మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. డిసెంబర్​7న మా ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజు నుంచే మేం బాధ్యులమవుతాం. 

డిజైన్, ప్లానింగ్, కన్​స్ట్రక్షన్, వర్క్​కంప్లీషన్​ సర్టిఫికెట్ల జారీ, ఆపరేషన్ అండ్ ​మెయింటనెన్స్​లో గత బీఆర్ఎస్ ​ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. బ్యారేజీ సెక్షనల్​ డ్రాయింగ్స్, జియోలాజికల్ ​ప్రొఫైల్​ఇవ్వలేదని అంటున్నారు. అసలు గత బీఆర్ఎస్ ​ప్రభుత్వం ఆ సర్వేలే చేయించలేదు. అందుకే వాటిని ఇవ్వలేకపోయాం. 

క్వాలిటీ కంట్రోల్, థర్డ్​పార్టీ ఇన్వెస్టిగేషన్, వర్షాకాలం ప్రారంభానికి ముందు, తర్వాత ఇన్​స్పెక్షన్లు చేయలేదు. అందుకే ఇవ్వలేకపోయాం. ఒకటి కన్నా ఎక్కువ వర్క్​కంప్లీషన్​సర్టిఫికెట్లు జారీ చేశారు. అందుకే వాటిని ఎన్డీఎస్ఏకు ఇవ్వలేదు. దీనిపై విజిలెన్స్​ఎంక్వైరీ కొనసాగుతున్నది. ప్రిలిమినరీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు లీగల్​ఒపీనియన్​ కోరాం” అని పేర్కొన్నారు. 

బొందలగడ్డకు మీరెందుకు వెళ్లినట్టు?  

‘‘మేడిగడ్డలో కాఫర్​డ్యామ్ కట్టి నీళ్లు నింపాలని కేటీఆర్​సిల్లీగా సలహాలు ఇస్తున్నారు. మాకు ఎన్డీఎస్ఏ సలహాలు, సూచనలే ముఖ్యం. మేం మేడిగడ్డకు వెళ్లినప్పుడు.. మేడిగడ్డ బొందలగడ్డ అని, ఏం పీకడానికి అక్కడికి వెళ్తున్నారని కేసీఆర్ అప్పట్లో అన్నారు. మరి ఈ రోజు బీఆర్ఎస్​ నేతలు ఏం చేయడానికి వెళ్లారో చెప్పాలి. బ్యారేజీ పర్రెలు, కుంగడంపై ప్రజలకు బీఆర్ఎస్​ నేతలు క్షమాపణ చెప్పాలి” అని ఉత్తమ్​ డిమాండ్​చేశారు.