
వర్షానికి కుప్పకూలిన కాంప్లెక్స్
అంత్యక్రియలకు వెళ్లిన సమయంలో ప్రమాదం
యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో ఘటన
మరో 15 మందికి గాయాలు
అంత్యక్రియలు జరుగుతుండగా వర్షం నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లోకి జనం
ఒక్కసారిగా కూలిన పైకప్పు
ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
ఘజియాబాద్ (యూపీ): తమ బంధువుకు తుది వీడ్కోలు పలికేందుకు వచ్చారందరూ.. అటు అంత్యక్రియలు జరుగుతున్నయి.. ఇంతలోనే జోరువాన… పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ కనిపించింది. వాన తగ్గేదాకా కాసేపు తలదాచుకుందామని అందులోకి వెళ్లారు అందరూ. కానీ వర్షం దెబ్బకి అప్పటికే బిల్డింగ్ దెబ్బతింది. ఈ విషయం తెలియని 40 మందికి పైగా దాని కిందే తలదాచుకుంటున్నారు.. ఇంతలో కుదుపు.. ఒక్క క్షణం.. పైకప్పు ఉన్నట్టుండి కుప్పకూలింది. అంతా చీకటి.. ఏమైందో తెలియదు.. ఆరుపులు.. ఏడుపులు.. రక్తపు మడుగులు.. శిథిలాల కింద పదుల సంఖ్యలో చిక్కుకుపోయారు. వారిలో 23 మంది అక్కడికక్కడే కన్నుమూశారు. మరో 15 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లా మురాద్ నగర్ లో జరిగిందీ ఘోరం. ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కొన్ని గంటలపాటు రెస్క్యూ
మురాద్ నగర్ లోని ఉఖ్లర్సి గ్రామంలో శనివారం జైరాం అనే వ్యక్తి చనిపోయాడు. ఆదివారం అంత్యక్రియల కోసం బంధువులు, ఇరుగు పొరుగు వాళ్లు శ్మశానవాటికకు చేరుకున్నారు. వాన కురుస్తుండటంతో శ్మశానవాటిక గ్రౌండ్ లో ఈ మధ్య నిర్మించిన ఓ కాంప్లెక్స్ లోకి వెళ్లారు. వర్షం ధాటికి ఉన్నట్టుండి పైకప్పు కుప్పకూలింది. అరుపులు, కేకలు వినిపించడంతో స్పాట్ కు వెళ్లిన స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. పోలీసులు, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీశారు. కొన్ని గంటలపాటు రెస్క్యూ కొనసాగింది. గాయపడ్డవారిని హాస్పిటల్ కు తరలించారు. చనిపోయిన వారందరూ పురుషులేనని, వారిలో చాలా మంది మృతుడు జై రాంకు బంధువులేనని అధికారులు చెప్పారు. సాయంత్రం నాటికి మృతుల్లో 18 మందిని ఐడెంటిఫై చేశామని ఘజియాబాద్ రూరల్ ఎస్పీ ఇరాజ్ రాజా వెల్లడించారు.
రూ.2 లక్షల సాయం
ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున సాయం ప్రకటించారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని మీరట్ కలెక్టర్, మీరట్ జోన్ ఏడీజీని ఆదేశించారు. కేంద్ర మంత్రి, ఘజియాబాద్ ఎంపీ వీకే సింగ్, ఉత్తరప్రదేశ్ హెల్త్ మినిస్టర్ అతుల్ గార్గ్ ఘటనాస్థలిని పరిశీలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.
పెండ్లి బస్సు బోల్తా, ఏడుగురు మృతి
కేరళలోని కాసరగోడ్ జిల్లాలో పెండ్లి బస్సు బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు. మరో 40 మందికిపైగా గాయపడ్డారు. కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు నుంచి పెండ్లి బస్సు కేరళలోని పాణత్తూర్ కు బయలుదేరింది. ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో అదుపు తప్పిన బస్సు రోడ్డుకు దిగువన ఉన్న ఇంటిపై బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మందికిపైగా ఉన్నారు. గాయపడ్డవారిని మంగళూరు, కాసరగోడ్ హాస్పిటల్స్ కు తరలించినట్టు కాసరగోడ్ జిల్లా కలెక్టర్ డి.సజిత్ చెప్పారు.