లఖ్ నవూ: ఉత్తరప్రదేశ్‌లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వానలు, ఈదురుగాలు, పిడుగుపాటు కారణంగా వేర్వేరు ఘటనల్లో 56 మంది చనిపోయారు. 46 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 1,021 ఇండ్లు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు నీటమునిగాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అత్యధికంగా సీతాపూర్‌లో 7 మంది మృతి చెందారు.
లఖీంపూర్ ఖేరి, బహ్రైచ్, బల్రాంపూర్‌లలో ఐదుగురు చొప్పున, అయోధ్య నలుగురు, గోరఖ్‌పూర్‌లో చెట్లు కూలిపోవడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కుండపోత వానలతో హర్దోయ్‌లోనే 272 ఇండ్లు దెబ్బతినగా, సీతాపూర్‌లో 108, చందౌలీలో 75 నివాసాలు ధ్వంసమయ్యాయి. వీటితో పాటు ఔరయ్యా, గోండా, హమీర్‌పూర్, షాజహాన్‌పూర్, బహ్రైచ్జిల్లాల్లో కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వర్షాల వల్ల జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది.
