
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఉన్న సబ్బుల తయారీ పరిశ్రమలో మంగళవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి బిల్డింగ్ మొత్తం నేలమట్టమయ్యింది. ఈ ఘటనలో ఫ్యాక్టరీ శిథిలాలు మీద పడి నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించాయి. మీరట్‌లోని లోహియా నగర్ ఏరియాలో ఉన్న ఓ రెండంతస్తుల ఇంట్లో సబ్బుల యూనిట్ ఉందని అధికారులు తెలిపారు. సబ్బుల తయారీ, ప్యాకింగ్ ఇక్కడే జరుగుతుందన్నారు. ఈ కంపెనీలో పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.