హేరాం : అయోధ్యలో నాగసాధువును కత్తులతో పొడిచి చంపారు

హేరాం : అయోధ్యలో నాగసాధువును కత్తులతో పొడిచి చంపారు

ఉత్తరప్రదేశ్ అయోధ్యలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రామ జన్మభూమి పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ గర్హి ఆలయ సముదాయంలోని ఆశ్రమంలో నాగసాధువును దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. అయోధ్యలో నాగు సాధువు హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. 

అయోధ్యలో నాగు సాధువు మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యగావించబడిన నాగసాధువు పేరు దుర్బల్ దాస్ గా గుర్తించారు. ఆయన రామ్ సహారే దాస్ శిష్యుడని తెలిపారు. నాగసాధువు దుర్బల్ దాస్ ను సన్నటి తీగతో గొంతుకోసి..ఆ తర్వాత కత్తితో పొడిచి చంపిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు ఆయన మెడ, ఛాతి, వీపుపై కూడా కత్తితో పొడిచిన గాయాలున్నాయని తెలిపారు. 

నాగసాధువు దుర్బల్ దాస్ హత్య జరిగిన రోజున ఆశ్రమంలోని మూడో గదిలో నిద్రపోయారని..ఆయనతో మరో ఇద్దరు శిష్యులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత రిషబ్ శుక్లా అనే ఓ శిష్యుడు అక్కడి నుంచి పరారయ్యాడని చెప్పారు. మరో శిష్యుడు గోవింద్ దాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దుర్బల్ దాస్ నివసిస్తున్న ఆశ్రమంలో సీసీ కెమెరాలు అమర్చినా..వాటిని స్విచ్ ఆఫ్ చేశారని పోలీసులు తెలిపారు. అయితే సీసీ టీవీ స్విచ్ ఆఫ్ చేసిన వ్యక్తి పుటేజీని పోలీసులు గుర్తించారు. మృతదేమాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించిన పోలీసులు..కేసును ఛేదించేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దించారు.