పిల్లల పాలిట దేవుడు.. 37 వేల మంది చిన్నారులకు ఫ్రీగా సర్జరీ 

పిల్లల పాలిట దేవుడు.. 37 వేల మంది చిన్నారులకు ఫ్రీగా సర్జరీ 

పేద కుటుంబంలో పుట్టిన సుబోధ్​. ట్రీట్మెంట్​కు డబ్బులు లేక తండ్రి కండ్ల ముందే చనిపోయాడు. సీరియస్​ హెల్త్​ కండీషన్​లో ఉన్న తండ్రి..  సుబోధ్​తో.. ‘నువ్వు బాగా చదువుకోవాలి. డాక్టర్​ అయి, సేవ చేయాలి’ అనేవాడు. తండ్రి చెప్పిన ఆ మాటల్ని బాగా గుర్తు పెట్టుకున్నాడు సుబోధ్​. పేదరికాన్ని జయించి పేదల డాక్టర్ అయ్యాడు. ఇప్పటి వరకూ  ‘క్లెఫ్ట్‌ పాలెట్‌’ ( అంగిలి చీలిక )తో పుట్టిన 37వేల మంది పిల్లలకు ఫ్రీ సర్జరీలు చేశాడు.

డాక్టర్​ సుబోధ్‌ది ఉత్తర ప్రదేశ్​. తండ్రి రైల్వేలో క్లర్క్​గా పని చేసేవాడు. డబ్బులు లేకపోవడం వల్ల జబ్బు పడిన తండ్రి చనిపోయాడు. ముగ్గురు పిల్లలతో ఇల్లు గడవడం కష్టమైందా తల్లికి. అయినా సుబోధ్‌ చదువు మానేయలేదు. సుబోధ్​ తల్లి, మరో ఇద్దరు అన్నయ్యలు కలిసి సబ్బులు తయారు చేసేవారు. వాటిని ట్రాఫిక్​ సిగ్నళ్ల దగ్గర అమ్మి డబ్బులు సంపాదించేవారు. ఆ డబ్బులతోనే సుబోధ్​ చదువు పూర్తి చేశాడు. ‘డాక్టర్‌ అయ్యి, సమాజానికి సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలి’ అన్న తండ్రి మాటల్ని మర్చిపోలేదు. కూలీ పని చేసి వచ్చిన డబ్బులు మొత్తం సుబోధ్‌ చదువుకే పెట్టాడు. అలా పట్టుదలతో మెడిసిన్​లో మంచి ర్యాంక్​ సాధించాడు. 1983లో పుణేలోని ఆర్డ్మ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజీలో, స్టేట్‌ కంబైన్డ్‌ ప్రి–మెడికల్‌ టెస్టులో మూడు డిపార్ట్​ మెంట్స్​లో మంచి రిజల్ట్​ తెచ్చుకున్నాడు. వాటిల్లో సుబోధ్‌ బిహెచ్‌యు సెలెక్ట్​ చేసుకున్నాడు. ఆ టైంలోనే ‘అంగిలి చీలిక’ అనేది జన్యుపరమైన లోపమని తెలుసుకున్నాడు. ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వాళ్లు నోరు తెరచి తినడానికి, మాట్లాడటానికి చాలా కష్టపడతారని, ఎప్పుడూ నవ్వలేరని తెలుసుకున్నారు. 

మెడిసిన్​ పూర్తి చేసుకున్న సుబోధ్‌ డాక్టర్​గా ప్రాక్టీస్​ మొదలుపెట్టాడు. 20 ఏండ్ల క్రితం వారణాసిలో హాస్పిటల్ ఏర్పాటు చేశాడు. జన్యుపరమైన అంగిలి చీలికతో పుట్టిన పిల్లలకు ఫ్రీగా ప్లాస్టిక్‌ సర్జరీ చేయడం మొదలుపెట్టాడు. అంగిలి చీలిక సమస్యతో బాధపడుతున్న యువకులు, వృద్ధులకు సుబోధ్​ పెద్ద దిక్కయ్యాడు. తన వైద్యసేవలు విస్తృతం చేయాలన్న ఉద్దేశంతో 2003లో ‘స్మైల్‌ ట్రైన్‌ ఇండియా’ టీమ్​మొదలుపెట్టాడు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అంగిలి చీలిక సర్జరీలు చేస్తున్నాడు. దేశంలోని అన్ని నగరాలకూ తిరుగుతూ వేల సర్జరీలు చేశాడు. ఇప్పటి వరకూ పదేళ్లలోపు ఉన్న 37 వేల మంది పిల్లలకు ఫ్రీగా సర్జరీలు చేశాడు. సుబోధ్‌ టీమ్​లో ప్లాస్టిక్‌ సర్జన్లతో పాటు.. సోషల్​ యాక్టివిస్టులు,   న్యూట్రిషనిస్టులు, కౌన్సెలింగ్‌ థెరపిస్ట్​లు ఉన్నారు.  వారణాసిలో ఉన్న సుబోధ్​ ఆసుపత్రి చాలా పాపులర్.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్జన్లు అక్కడ అంగిలి చీలికకు చేసే ఆపరేషన్​ల గురించి శిక్షణ ఇస్తారు.