హ్యాట్సాప్ : వీధి కుక్కల దాడి నుంచి చిన్నారిని కాపాడిన డెలివరీ బాయ్..

హ్యాట్సాప్ : వీధి కుక్కల దాడి నుంచి చిన్నారిని కాపాడిన డెలివరీ బాయ్..

దేశంలో ఇటీవలి కాలంలో కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ చిన్నారిని ఐదు కుక్కలు చుట్టుముట్టి తీవ్రంగా దాడి చేశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. హౌసింగ్ సొసైటీలో ఉన్న ఐదు వీధి కుక్కలు చిన్నారిని చుట్టుముట్టి దాడి చేయడం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలోని సొసైటీలో కుక్కల దాడి ఘటన చోటుచేసుకుంది.

ఈ సీసీటీవీ ఫుటేజీని గనక పరిశీలిస్తే.. కుక్కలు ఆ పిల్లవాడిని చుట్టుముట్టాయి. చిన్నారి అంతలోనే భయంతో అరుస్తూ సహాయం కోసం అరుస్తూనే ఉంది. అటుగా వెళ్తున్న ఓ డెలివరీ బాయ్ దీన్ని చూశాడు. బైక్‌పై వచ్చిన డెలివరీ బాయ్‌ కుక్కల బారి నుంచి చిన్నారిని రక్షించాడు. డెలివరీ బాయ్ చిన్నారిని రక్షించిన ఘటనకు సంబంధించిన ఈ సీసీటీవీ వీడియో సంచలనం సృష్టించింది. కాగా సంఘటన జరిగిన తేదీ, వారి పేరు ఇంకా తెలియరాలేదు.

ఘజియాబాద్‌లో వీధికుక్కల దాడికి గురైన చిన్నారికి పెద్దగా గాయాలు కాలేదు. ఈ మధ్య కాలంలో ఆ ప్రాంతంలో పిల్లలపై కుక్కల దాడులు పెద్ద సమస్యగా మారాయి. దీంతో ఈ తరహా సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కుక్కల దాడి కారణంగా చాలా మంది పిల్లలు తీవ్రంగా గాయపడగా, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు.