బిడ్డ పెండ్లి కోసం లాకర్లో దాచుకుంటే.. 18 లక్షలకు చెదలు పట్టింది

బిడ్డ పెండ్లి కోసం లాకర్లో దాచుకుంటే..  18 లక్షలకు చెదలు పట్టింది

మొరాదాబాద్: ఓ మహిళ తన బిడ్డ పెండ్లి కోసం బ్యాంకు లాకర్​లో దాచుకున్న రూ.18 లక్షలకు చెదలు పట్టింది. యూపీలోని మొరాదాబాద్ కు చెందిన పాఠక్ అనే మహిళ గతేడాది అక్టోబర్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆషియానా బ్రాంచ్‌లోని తన లాకర్‌లో రూ.18 లక్షల నగదు దాచుకుంది. లాకర్​అగ్రిమెంట్​ రెన్యూవల్​ కోసం బ్యాంకు అధికారులు ఆమెకు ఇటీవల సమాచారం ఇచ్చారు. బ్యాంకుకు వెళ్లిన పాఠక్​ తన లాకర్​ తెరిచి చూసి షాక్​ తిన్నది. 

అందులోని కరెన్సీ నోట్లు మొత్తం చెదలు పట్టి మట్టిగా మారాయి. దాన్ని చూసిన బ్యాంకు అధికారులూ ఆశ్చర్యపోయారు. బిడ్డ పెండ్లి కోసం దాచుకున్న డబ్బు పాడైపోవడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. న్యాయం చేయాలని డిమాండ్ ​చేయడంతో.. బ్యాంకు సిబ్బంది తమ హెడ్​ఆఫీసుకు రిపోర్ట్​ పంపారు. అయితే ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం బ్యాంకు లాకర్లలో ఎలాంటి నగదు నిల్వ ఉంచకూడదని అధికారులు వెల్లడించారు.