ఉత్తరాఖండ్‎లో సొరంగంలో ఢీకొన్నరెండు రైళ్లు.. 70 మందికి గాయాలు

ఉత్తరాఖండ్‎లో సొరంగంలో ఢీకొన్నరెండు రైళ్లు.. 70 మందికి గాయాలు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‎లో రైలు ప్రమాదం జరిగింది. చమోలి జిల్లాలో రెండు లోకో రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 70 మంది కార్మికులు గాయపడ్డారు. అధికారుల సమాచారం ప్రకారం.. పిపాల్కోటిలోని టెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (THDC) ప్రాజెక్ట్‌లోని సొరంగంలో మంగళవారం (డిసెంబర్ 30) రాత్రి  షిష్ట్ మార్పు సమయంలో రెండు లోకో రైళ్లు ఢీకొన్నాయి. సాంకేతిక లోపం కారణంగా ఒక రైలు మరో రైలును వెనక నుంచి ఢీకొట్టింది.

ఈ ఘటనలో 70 మంది కార్మికులు గాయపడ్డారు. సొరంగంలో చీకటిగా ఉన్న ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన తర్వాత సొరంగంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఎలా బయటకు రావాలో తెలియక కార్మికులు భయాందోళనతో అర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అధికారులు, స్థానిక పరిపాలన బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. 

గాయపడిన కార్మికులను అంబులెన్స్‌లు, ఇతర వాహనాలలో ఆసుపత్రులకు తరలించారు. సొరంగంలో చీకటిగా ఉండటంతో సహయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. మరోవైపు ఈ ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు.. మరేదేమైనా కారణం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.