- రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
డెహ్రాడూన్: రానున్న రోజుల్లో ఉత్తరాఖండ్ మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించుకుంటూ డబుల్ ఇంజన్ సర్కార్ ముందుకెళ్తున్నదని చెప్పారు. వచ్చే కొన్నేండ్లలో ఉత్తరాఖండ్ ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఎదుగుతుందని ఆకాంక్షించారు. ఉత్తరాఖండ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం డెహ్రాడూన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.8,260.72 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉత్తరాఖండ్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నేను ఆధ్యాత్మిక యాత్ర కోసం ఎప్పుడు ఇక్కడికి వచ్చినా.. కష్టపడే ఇక్కడి ప్రజలు నాకు స్ఫూర్తిని ఇస్తారు. ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌దే అని నేను ఇంతకుముందే చెప్పాను. గత 25 ఏండ్లలో రాష్ట్రం ఎంతో మారింది. ఎడ్యుకేషన్, హెల్త్, టూరిజం, ఇండస్ట్రీ, ఎనర్జీ, రూరల్ డెవలప్‌మెంట్ రంగాల్లో పురోగతి సాధించింది. 25 ఏండ్ల కింద రాష్ట్ర బడ్జెట్ రూ.4 వేల కోట్లు, కానీ ఇప్పుడది రూ.లక్ష కోట్లు. ఒకప్పుడు 6 నెలలకు 4 వేల మంది టూరిస్టులు వచ్చేవారు. ఇప్పుడు రోజుకు 4 వేల మంది వస్తున్నారు” అని చెప్పారు.
ప్రతి గ్రామం.. మినీ టూరిజం హబ్
ఉత్తరాఖండ్‌ను పర్యాటకం పరంగా, ఆధ్యాత్మికం పరంగా అభివృద్ధి చేసేందుకు బీజేపీ సర్కార్ కృషి చేస్తున్నదని చెప్పారు. ‘‘గ్లోబల్ నెట్‌వర్క్‌తో ఆలయాలు, ఆశ్రమాలు, మెడిటేషన్, యోగా సెంటర్లను కనెక్ట్ చేస్తాం. ఆయుర్వేదం, నేచురోపతి లాంటి వైద్య విధానాలకు మంచి స్పందన వస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా ఆయుర్వేదిక్, నేచురోపతి, యోగా సెంటర్లను ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామం ఒక మినీ టూరిస్ట్ హబ్‌గా మారాలి. హోమ్ స్టేలు ఏర్పాటు చేసి.. లోకల్ ఫుడ్, కల్చర్‌ను ప్రమోట్ చేయాలి” అని సూచించారు. ధామి సర్కార్ ఎంతో ధైర్యసాహసాలతో యూసీసీని అమలు చేస్తున్నదని, ఇతర రాష్ట్రాలు కూడా దాన్ని అమలు చేయాలని కోరారు.
