ఉత్తరాఖండ్‎లో ఘోర ప్రమాదం: లోయలో పడిపోయిన బస్సు.. ఏడుగురు మృతి

ఉత్తరాఖండ్‎లో ఘోర ప్రమాదం: లోయలో పడిపోయిన బస్సు.. ఏడుగురు మృతి

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‎లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం (డిసెంబర్ 30) ఉదయం అల్మోరా జిల్లాలోని భికియాసైన్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న సహయక బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని రెస్య్కూ ఆపరేషన్ చేపట్టాయి.

గాయపడిన వారిని వైద్య చికిత్స కోసం భికియాసైన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నట్లు అల్మోరా ఎస్ఎస్పీ దేవేంద్ర పించా తెలిపారు. అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. డ్రైవర్ రోడ్డును సరిగ్గా అంచనా వేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.