తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టితీరుతం

తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టితీరుతం
  • అక్కడ ప్రాజెక్టు కడితే విద్యుత్ ఖర్చు తగ్గేది: మంత్రి ఉత్తమ్ కుమార్‌‌‌‌ రెడ్డి
  • కేసీఆర్ హయాంలో కట్టిన ప్రాజెక్టుఆయన హయాంలోనే కుంగింది
  • బ్యారేజీ పాడవడానికికారణం ఎవరో కేటీఆర్ చెప్పాలి
  • ఎన్‌‌డీఎస్‌‌ఏ అధికారులతో మంత్రి ఉత్తమ్​, ఇరిగేషన్ అధికారుల భేటీ

హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టును కట్టి తీరుతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. గ్రావిటీతోనే నీళ్లను తీసుకొచ్చేలా ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ ఉంటే విద్యుత్ ఖర్చు తగ్గేదన్నారు. ప్రస్తుతం ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టునూ కొనసాగిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష ఎకరాల ఆయకట్టు కూడా క్రియేట్ కాలేదని, కానీ, రాష్ట్రమంతా నీళ్లిచ్చామంటూ గత సర్కార్ తప్పుడు ప్రచారం చేసిందని విమర్శించారు.

కేసీఆర్ హయాంలో కట్టిన ప్రాజెక్టు ఆయన హయాంలోనే కూలిపోయిందని, మేడిగడ్డ బ్యారేజీ కుంగినా 43 రోజుల వరకు కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఫైర్‌‌‌‌ అయ్యారు. ఈ ప్రాజెక్టుతో ప్రజా ధనాన్ని గత ప్రభుత్వం వృథా చేసిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో విద్యుత్ ఖర్చే ఏడాదికి రూ.10 వేల కోట్లు వస్తున్నదని, వడ్డీలకు మరో రూ.10 వేల కోట్లు కడుతున్నామని తెలిపారు.

శనివారం ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌‌డీఎస్‌‌ఏ) చైర్మన్ అనిల్ జైన్, మేడిగడ్డపై నియమించిన ఎన్‌‌డీఎస్‌‌ఏ నిపుణుల కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌‌‌‌తో మంత్రి ఉత్తమ్, ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్‌‌సీ(ఓఅండ్‌‌ఎం) నాగేందర్ రావు తదితరులు సమావేశమయ్యారు. అనంతరం మంత్రి ఉత్తమ్ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో మీడియాతో మాట్లాడారు.

‘‘బ్యారేజీల్లో 3 నుంచి 4 టీఎంసీలకు మించి నీళ్లను స్టోర్ చేయడానికి లేదు. కానీ, అంతకుమించి బ్యారేజీల్లో నీటిని నిల్వ చేశారు. ఏ టెస్టులు చేయకుండానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించారు. బ్యారేజీలకు రిపేర్లను నిర్మాణ సంస్థలతోనే చేయిస్తున్నాం. ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు’’అని తెలిపారు.

ఎన్‌‌డీఎస్‌‌ఏ సూచనలను అమలు చేశాం..

బ్యారేజీలకు జరిగిన డ్యామేజీలపై ఎన్‌‌డీఎస్‌‌ఏ సూచించిన సిఫార్సులను అమలు చేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇప్పటిదాకా చేసిన పనులు, టెస్టుల గురించి ఎన్‌‌డీఎస్‌‌ఏకి వివరించామని చెప్పారు. భవిష్యత్‌‌లో తీసుకోవాల్సిన చర్యలపైనా అధికారులతో చర్చించామన్నారు. సోమవారం మరోసారి భేటీ అవుతామని వెల్లడించారు.

కాగా, ఇప్పటిదాకా జరిగిన టెస్టులకు సంబంధించిన రిపోర్టులను తెప్పించుకుని ఫుల్ రిపోర్ట్‌‌ను ఇవ్వాల్సిందిగా ఎన్‌‌డీఎస్‌‌ఏ అధికారులను ప్రభుత్వం కోరినట్లు తెలిసింది. పెండింగ్ పడిన జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ ఇప్పట్లో సాధ్యం కాదని, ఇప్పటికే మేడిగడ్డ వద్ద వరద మొదలైందని ఎన్‌‌డీఎస్‌‌ఏకి అధికారులు చెప్పినట్టు సమాచారం. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ కూడా ఎన్‌‌డీఎస్‌‌ఏ రిపోర్టు కోసం వేచి చూస్తుండడంతో వీలైనంత త్వరగా రిపోర్టును ఇవ్వాల్సిందిగా కోరినట్టు తెలుస్తున్నది.

బ్యారేజీ పాడవడానికి కారణమెవరు..?

మేడిగడ్డ బ్యారేజీ పాడవడానికి కారణం ఎవరో చెప్పాలని కేటీఆర్‌‌‌‌ను మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడానికైనా ఓ హద్దుండాలని మండిపడ్డారు. మూడు బ్యారేజీల్లోని గేట్లను ఎత్తి నీళ్లను కిందకు వదలాలని ఎన్‌‌డీఎస్‌‌ఏ సూచించిందని గుర్తుచేశారు. బీఆర్‌‌‌‌ఎస్ దోపిడీ వల్లే ప్రాజెక్టులో లోపాలు జరిగాయని ఆరోపించారు. కాళేశ్వరానికి మేడిగడ్డ గుండెకాయ లాంటిదన్నారని, కానీ, ఆ ప్రాజెక్టు వారి హయాంలోనే కుంగిపోయిందన్నారు.

ప్రాజెక్టును నాశనం చేసిన వారే సలహాలిస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని, కేసీఆర్, కేటీఆర్‌‌‌‌ల ఉచిత సలహాలు తమకు అవసరం లేదన్నారు. అన్నారం ప్రాజెక్టులోనూ భారీగా సీపేజీ ఉందని, సుందిళ్లలోనూ లోపాలున్నాయంటూ ఎన్‌‌డీఎస్‌‌ఏ చెప్పిందని గుర్తుచేశారు. ఎన్‌‌డీఎస్‌‌ఏ సూచనల మేరకే ముందుకెళ్తామని, ఆ అధికారుల కంటే కేటీఆర్‌‌‌‌కు ఎక్కువ పరిజ్ఞానం ఉంటుందని అనుకోవడం లేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఐదేండ్లలో కేవలం 65 టీఎంసీలనే ఎత్తిపోశారని, అంటే ఏడాదికి 13 టీఎంసీలు మాత్రమే పంప్ చేశారన్నారు.