హవాలా కేసులో..తమిళనాడు మంత్రి అరెస్టు

హవాలా కేసులో..తమిళనాడు మంత్రి అరెస్టు
  • ఇంట్లో సోదాలు చేసి ఆపై అరెస్టు చేసిన ఈడీ అధికారులు
  • బెదిరింపు రాజకీయాలంటూ సీఎం స్టాలిన్ మండిపాటు

చెన్నై: తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖల మంత్రి వి.సెంథిల్ బాలాజీని హవాలా కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం మంత్రి నివాసంలో అధికారులు సోదాలు చేశారు. అనంతరం రాత్రి ఆయనను సుదీర్ఘంగా విచారించినట్లు సమాచారం. ఆ సమయంలో తనకు ఆరోగ్యం సరిగాలేదని, ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో మంత్రిని ప్రభుత్వ మల్టీ సూపర్  స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆయనను అడ్మిట్  చేశారు. 

మంత్రిని పరీక్షించిన వైద్యులు.. ఆయనకు సాధ్యమైనంత త్వరగా బైపాస్  సర్జరీ చేయాలని సూచించారు. ఈ కేసులో స్థానిక కోర్టు మంత్రికి ఈ నెల 28 వరకు జుడీషియల్  కస్టడీ విధించింది. మరోవైపు, మంత్రి సెంథిల్​ కనిపించడంలేదంటూ డీఎంకే నేతలు మద్రాస్  హైకోర్టులో హెబియస్  కార్పస్  పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ అధికారులు మంత్రిని అరెస్టు చేయడాన్ని సీఎం స్టాలిన్  ఖండించారు. ఆస్పత్రిలో సెంథిల్​ను పరామర్శించాక మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. మంత్రిని అరెస్టు చేసే విషయంలో రూల్స్ పాటించలేదని ఆరోపించారు.

మంత్రి రిజైన్  చేయాలి: అన్నాడీఎంకే

హవాలా కేసులో అరెస్టయిన మంత్రి సెంథిల్  బాలాజీ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే చీఫ్​ కె.పళనిస్వామి డిమాండ్  చేశారు.