యాక్సిడెంట్లను తగ్గించే వీ2ఎక్స్​ టెక్నాలజీ

యాక్సిడెంట్లను తగ్గించే వీ2ఎక్స్​ టెక్నాలజీ

హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఉపయోగపడే వీ2ఎక్స్​ టెక్నాలజీని  సుజుకి మోటార్ కార్పొరేషన్ హైదరాబాద్​ ఐఐటీలో బుధవారం ప్రదర్శించింది. దీనిని మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (ఎంఎస్​ఐఎల్​)  ఐఐటి హైదరాబాద్ (ఐఐటీహెచ్​) ఫ్యూచరిస్టిక్ వీ2ఎక్స్, క్యాప్​జెమినీతో కలిసి డెవెలప్​ చేశామని ప్రకటించింది. ఈ విధానంలో రూటర్​వంటి డివైజ్​ను కారు వెనుక భాగంలో అమర్చుతారు. ఇది 5జీ లేదా వెహికల్​ టు వెహికల్​ డేటా ట్రాన్స్​ఫర్​ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. కారు సమీప రోడ్డులో ఎవరైనా తప్పుగా​ డ్రైవ్​ చేసినా, అంబులెన్స్​ వచ్చినా, రోడ్డు బాగా లేకున్నా కారులోని స్క్రీన్​పై కనిపిస్తుంది. 5జీ టెక్నాలజీ లేని చోట డేటా ట్రాన్స్​ఫర్​ సిస్టమ్​ ద్వారా పనిచేస్తుంది. అంటే నెట్​ లేకున్నా పనిచేస్తుంది.

ఈ సందర్భంగా సుజుకీ ప్రతినిధులు మాట్లాడుతూ ‘‘ఇండియాలో ఏటా లక్షల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్​ రూల్స్​ వయొలేషన్స్​ చాలా ఎక్కువ. ప్రభుత్వం కార్లకు ఎయిర్​బ్యాగ్స్​ను తప్పనిసరి చేసింది. వీ2ఎక్స్​ టెక్నాలజీని కూడా తప్పనిసరి చేస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. ఈ టెక్నాలజీ డెవెలప్​మెంట్​ మొదటిదశలో ఉంది. మార్కెట్లోకి రావడానికి కొన్నేళ్లు పడుతుంది. యూరప్​ వంటి దేశాల్లో వీ2ఎక్స్​ను ఇది వరకే వాడుతున్నారు”అని వివరించారు. వీ2ఎక్స్​ అప్లికేషన్‌‌లను చూపే మొదటి ప్రోటోటైప్‌‌ కార్లను హైదరాబాద్​ ఐఐటీ క్యాంపస్‌‌లో ప్రదర్శించారు.