ఐపీఎల్ ఆటగాళ్లకు కరోనా వ్యాక్సిన్

ఐపీఎల్ ఆటగాళ్లకు కరోనా వ్యాక్సిన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021 )కు ఒక వైపు ఏర్పాట్లు జరుగుతూ ఉండగా..మరోవైపు కరోనా వైరస్ లీగ్ ను కమ్మేసే అవకాశాలు కూడా కన్పిస్తున్నాయి. ఇప్పటికే పలువురు క్రికెటర్లకు కరోనా సోకింది. ఇక ముంబై లోని వాంఖడే స్టేడియం నిర్వాహకులకు కూడా కరోనా సోకడంతో IPL నిర్వాహకుల్లో సరికొత్త టెన్షన్ మొదలైంది. దీంతో ఐపీఎల్ ఆటగాళ్లకు వ్యాక్సిన్ వేస్తే బెటర్ అంటున్నారు నిర్వాహకులు. ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లకు వ్యాక్సినేష‌న్ అంశంపై తాము ఆలోచిస్తున్నట్లు BCCI ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. 

ఆరోగ్యశాఖ‌తో సంప్ర‌దిస్తున్నామ‌ని, ఆట‌గాళ్ల‌కు వ్యాక్సిన్ వేయాల‌ని అడుగుతున్న‌ట్లు చెప్పారు రాజీవ్ శుక్లా. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఐపీఎల్ కోసం అన్ని ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. కేవ‌లం ఆరు వేదిక‌ల్లోనే IPL నిర్వ‌హిస్తున్నామ‌ని.. ఆ దిశ‌గా బ‌యో బ‌బుల్ ఏర్పాటు చేశామ‌ని శుక్లా చెప్పారు. జట్లలో స‌భ్యుల సంఖ్య‌ను కూడా పెంచిన‌ట్లు చెప్పారు. ప్రేక్ష‌కులు లేకుండానే టోర్నీ కొన‌సాగుతుంద‌ని క్లారిటీ ఇచ్చారు. ఆటగాళ్లకు కరోనా సోకకుండా అన్ని ఏర్పాట్లు చేశామని బయో బబుల్ లో కఠిన ఆంక్షలు ఉంటాయని.. ఏ ఒక్కరు కూడా ఇందుకు అతీతం కాదని స్పష్టం చేశారు.