అపార్ట్‌మెంట్ల దగ్గరే వ్యాక్సిన్

అపార్ట్‌మెంట్ల దగ్గరే వ్యాక్సిన్
  • హైదరాబాద్ లో కమ్యూనిటీ వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు 
  • వారంలోగా డ్రైవ్, యాప్ ద్వారా రిజిస్ట్రేషన్
  • తొలి దఫా 50వేల టీకాల పంపిణీకి చర్యలు 

హైదరాబాద్, వెలుగు: కరోనా టీకాలు వేయించుకోవాలంటే హెల్త్ సెంటర్ల దగ్గర క్యూలైన్లు తప్పడం లేదు. ముందుగా స్లాట్ బుక్ చేసుకున్నా.. వ్యాక్సిన్ల కొరతతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు, ఇంటికి దగ్గరలోనే టీకాలను అందుబాటులోకి తెచ్చేందుకు కమ్యూనిటీ వ్యాక్సినేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో రెసిడెన్షియల్ వెల్ఫేర్ సంఘాలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇందు కోసం సిటీలోని అన్ని ఆర్‌‌డబ్ల్యూఏలు కలిసి టీకా రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక యాప్ ను రెడీ చేస్తున్నాయి. ఇప్పటికే హాస్పిటళ్లతో ఒప్పందాలు కూడా చేసుకున్నాయి.

50 కమిటీల ఆసక్తి
కమ్యూనిటీ వ్యాక్సినేషన్ కు హైదరాబాద్ లోని రెసిడెన్షియల్, అపార్ట్‌‌మెంట్ గేటెడ్ కమ్యూనిటీ, కాలనీ వెల్ఫేర్ సంఘాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇప్పటికే యునైటెడ్ ఫెడరేషన్ ఫర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాబితా సిద్ధం చేస్తున్నాయి. తొలి దశలో 50వేల మందిని టీకా డ్రైవ్‌లో భాగస్వామ్యం చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. దీనికి ప్రత్యేక యాప్ ను డిజైన్ చేస్తుండగా, ఇప్పటికే ఆఫ్ లైన్ లో సేకరించిన వివరాల ప్రకారం 50 కమిటీలు కమ్యూనిటీ వ్యాక్సినేషన్‌కు ఆసక్తితో ఉన్నాయని రెసిడెన్షియల్ వెల్ఫేర్ సంఘాల నేతలు తెలిపారు.

యాప్‌తో రిజిస్ట్రేషన్..
కమ్యూనిటీ పరిధిలో టీకా రిజిస్ట్రేషన్ కోసం 'యూ వ్యాక్సిన్ యాప్'ను సిద్ధం చేస్తున్నారు. రెండ్రోజుల్లో ఇది అందుబాటులోకి రానుంది. దీని ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కమ్యూనిటీ హాల్, క్లబ్ హౌస్, ఓపెన్ స్పేస్ లో టీకా పొందవచ్చు. తొలి దశలో ఒక్కో కమ్యూనిటీలో 1,000 మందికి టీకాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని.. కిమ్స్, అపోలో వంటి కార్పొరేట్ హాస్పిటళ్లతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నట్లుగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ సంఘాల నేతలు చెబుతున్నారు. ఐటీ కారిడార్ లోని గచ్చిబౌలి, మియాపూర్, కిస్మత్ పురా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, మాదాపూర్, శేరిలింగంపల్లి, బాచుపల్లి, మణికొండ, నార్సింగి, నానక్ రాం గూడ వంటి ఏరియాల నుంచి డిమాండ్ ఎక్కువగా వస్తున్నట్లుగా తెలిపారు. 

ప్రభుత్వ ధరకే టీకా పంపిణీ..
మాస్ వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాం. ప్రభుత్వ సెంటర్ల వద్ద రద్దీ, కరోనా వ్యాపిస్తుందనే భయంతో రెసిడెంట్ల నుంచి స్పందన రాలేదు. ప్రతి రెసిడెన్షియల్ కమ్యూనిటీలో టీకా డ్రైవ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. కమిటీల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే టీకాలు అందిస్తాం.
- బీటీ శ్రీనివాసన్, యూఎఫ్ ​ఆర్ డబ్ల్యూఏ, జనరల్ సెక్రటరీ