హైదరాబాద్లో సరికొత్తగా వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్

హైదరాబాద్లో సరికొత్తగా వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్

వాలంటైన్స్ డే.. లవర్స్​కి, కొత్తగా పెళ్లయిన జంటకు ఇదెంతో స్పెషల్ డే. భాగస్వామికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ రోజును ఎంతో స్పెషల్​గా సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తుంటారు. తమ ప్రేమను గొప్పగా చెప్పాలని ఆరాటపడు తుంటారు. అలాంటి వారి కోసం మార్కెట్​లో ఢిపరెంట్ కాన్సెప్ట్​లు అందుబాటులోకి వచ్చాయి. ఇండ్లు, కేఫ్​లు, హోటళ్లలోనూ డిపరెంట్​గా లవర్స్ డే సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నాయి. సిటిజన్లు వీటిని సద్వినియోగం చేసుకుంటూ కొత్త రకం గిఫ్ట్ లు, సర్ ప్రైజ్ థీమ్​లతో భాగస్వామిని ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు.  

డెస్టినేషన్ సెలబ్రేషన్స్.. 

ఈ ప్రత్యేకమైన రోజును మెమోరబుల్​గా మార్చుకునేందుకు ఇష్టమైన వారితో ఎక్కువ సేపు గడిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటి వారు డెస్టినేషన్ ​సెలబ్రేషన్లకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి సెలబ్రేషన్స్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. గతంతో పోలిస్తే ఈ సారి డెస్టినేషన్ సెలబ్రేషన్లకు వెళ్లే వారి సంఖ్య పెరిగిందని.. టూరిజం ప్యాకేజీల నిర్వాహకులు అంటు
న్నారు. ఇప్పటికే చాలా మంది ఇతర రాష్ట్రాల్లోని టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. 

థీమ్ డెకరేషన్స్​తో.. 

సందర్భం ఏదైనా థీమ్డ్ డెకరేషన్స్ తప్పనిసరి అయిపోయాయి. ముఖ్యంగా వారం మొత్తం జరుపుకొనే వాలంటైన్స్ డేకు సిటిజన్లు డిఫరెంట్​గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక్కో రోజును ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకుని వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వాలంటైన్స్ డేకు చాలా మంది కలర్ ఫుల్ థీమ్ బెలూన్స్ డెకరేషన్​ను ప్లాన్ చేసుకున్నారు. ఇండోర్ లోనే సెలబ్రేషన్స్ చేసుకోవటానికి ఇష్టపడుతున్నవారంతా వీటిని అడ్వాన్స్ గా బుకింగ్ చేశారు. బెలూన్లు, రోజాలతో రూమ్ ను అందంగా డెకరేట్ చేసి తమ పార్ట్​నర్​ను సర్ ప్రైజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. 

హోటళ్లలో స్పెషల్​ మెనూలు..

సిటీలోని హోటళ్లలో వాలంటైన్స్ డే స్పెషల్ మెనూలు అందుబాటులోకి వచ్చాయి. ప్లేస్​ను అందంగా అలంకరించి మ్యూజిక్, క్యాండిల్స్, లైట్లతో ఆకర్షణీయంగా మారుస్తున్నారు. మంగళవారం  నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్‌‌‌‌లో  ‘వాలంటైన్స్ డేట్  నైట్’ పేరుతో ప్రోగ్రామ్ జరగనుంది. ఇక్కడ ఔట్ డోర్ సెట్టింగ్‌‌లో క్యాండిల్ లైట్ టేబుల్స్, స్పెషల్ వంటకాలు, డ్రింక్స్, మ్యూజిక్​తో పాటు స్విమ్మింగ్ పూల్​ను అందంగా తీర్చిదిద్దారు. ఇవ్వాల రాత్రి 7 నుంచి  11గంటల వరకు ఈ పూల్ సైడ్ డైనింగ్​ని అందిస్తున్నారు. ఇలాగే కెఫేలు, మాల్స్‌‌, రెస్టారెంట్లనూ అందంగా డెకరేట్ చేశారు.


ఏడాదంతా వాడిపోని గులాబీలు

ప్రేమను పంచేందుకు పూలదే మొదటి ప్రాధాన్యత.   ప్రేమికుల రోజున ప్రేమను పంచేందుకైనా, తెలిపేందుకైనా పూల బొకేలను ఇచ్చేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ నేపథ్యంలో బొకే షాపులకు ఆర్డర్లు, ప్రీ బుకింగ్‌‌లు పెరిగాయి. ఏడాదంతా వాడిపోని గులాబీలతో పాటు గులాబీల బాక్సులు కూడా మార్కెట్‌‌లో అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిని గిఫ్ట్​గా ఇస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. డిఫరెంట్ కలర్స్​తో అందంగా డిజైన్ చేసిన బొకే లను చాలా మంది కొంటున్నారు. కస్టమైజ్డ్ గా ఉండే బొకేలకు క్రేజ్ విపరీతంగా పెరిగింది. నచ్చిన ఫ్లవర్స్ తో ఇష్టమైన వారి పేరులో మొదటి అక్షరం వచ్చేలా చేయించి దాని చుట్టూ వేరే పూలతో డెకరేట్ చేసి కస్టమైజ్డ్ బొకేలు ఇస్తున్నారు.

ప్రేమ పక్షుల కోసం టైటానిక్

జేమ్స్ కామెరూన్ డైరెక్షన్​లో వచ్చిన ‘టైటానిక్’ సినిమా  ప్రేమజంటలకు సరికొత్త ఫీల్​ను ఇచ్చింది. 1997లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా అలరించింది.  హీరో హీరోయిన్లు లియోనార్డో డికాప్రియో, కేట్​విన్ స్లెట్ పోషించిన జాక్, రోజ్ పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఆ అనుభూతిని మరోసారి పంచేందుకోసం ఈ సినిమాను రీ రిలీజ్​చేశారు. టైటానిక్  రిలీజై ఈ ఏడాదితో  25 ఏండ్లు పూర్తవ్వడంతో ఈ నెల 10న ఇండియాలో రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 3డీ, 4కే క్వాలిటీతో విడుదల​చేశారు. హైదరాబాద్​లోనూ పలు థియేటర్లలో ‘టైటానిక్’ మూవీ ప్రదర్శన కొనసాగుతోంది.