చిత్రపురి కాలనీ స్కాం కేసులో కస్టడీకి వల్లభనేని అనిల్‌

చిత్రపురి కాలనీ స్కాం కేసులో కస్టడీకి వల్లభనేని అనిల్‌

చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్​ను కస్టడీకి అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.  దీంతో రెండురోజుల పాటు అనిల్ ను కస్టడీలోకి తీసుకుని రాయదుర్గం పోలీసులు విచారించనున్నారు.  ఈ స్కాంలో మిగతా సభ్యుల పాత్రపై దర్యాప్తు చేయనున్నారు.  చిత్రపురి కాలనీలోని ప్లాట్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని పోలీసులకు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి అనిల్​ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

 ప్లాట్ కోసం మాదాపూర్​కు చెందిన తోట శ్రీపద్మ రూ.12 లక్షలు చెల్లించింది. అయితే, తనకు అలాట్ చేసిన ప్లాటును మరొకరికి రిజిస్ట్రేషన్ చేశారని మార్చి 7న పోలీసులకు ఫిర్యాదు చేసింది. యనమల మాధవ్ కూడా రూ.4 లక్షలు చెల్లించాడు. డబ్బులు చెల్లించిన తర్వాత ప్లాట్ అలాట్‌‌మెంట్​ను కమిటీ సభ్యులు రద్దు చేశారని, తాను చెల్లించిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని మార్చి 20న కంప్లైంట్ చేశాడు. 

వీరితో పాటు బక్కి విద్య, కాట్రగడ్డ రవితేజ, జయశ్రీ, శ్రవణ్ కుమార్  పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు చిత్రపురి కాలనీ ప్లాట్ల కేటాయింపు కమిటీలోని  వల్లభనేని అనిల్, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్​ బాల, చంద్రమధు, కాదంబరి కిరణ్, మహానందరెడ్డితో పాటు మరికొందరిపై కేసు బుక్ చేశారు. ఈ కేసులో మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. బాధితులు 150 మంది వరకు ఉంటారని, ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షల నుంచి 40 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.