విశ్లేషణ: విలువలు లేనిపార్టీలు.. పట్టింపు లేని ప్రభుత్వం

విశ్లేషణ:  విలువలు లేనిపార్టీలు.. పట్టింపు లేని ప్రభుత్వం

ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రభుత్వ అధినేతలు కీలక పాత్ర పోషించాలి. చౌకబారు మాటలు, అశ్లీల పదజాలం, ఇతరుల గౌరవానికి భంగం కలిగించే మాటలు మాట్లాడడం అవివేకమే కాదు నేరం కూడా. ఇందుకు ఏ పార్టీ  కూడా మినహాయింపు కాదు. పాలనా పరమైన అంశాలపై మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, సంఘర్షణలు ఎదురు కావచ్చు. వాటిని పెద్ద మనసుతో, జాగరూకతతో, విశ్లేషణ పూర్వక జ్ఞానంతో, నిపుణులు మేధావుల సహకారంతో త్రై పాక్షిక సమావేశాల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇది విజ్ఞత అనిపించుకుంటుంది. రాష్ట్రంలోనూ దేశంలోనూ కొనసాగుతున్నది రాజ్యాంగానికి భిన్నంగా ప్రభుత్వ పెద్దలు తమ వ్యక్తిగత ఎజెండాతో రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగాన్ని సైతం పక్కనపెట్టి చట్టాలను కూడా  ఉల్లంఘిస్తూ స్వప్రయోజనాలకు పాల్పడుతున్నారు. ఇక్కడే ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు, బుద్ధిజీవులు, మేధావులు ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అధికారంలో ఉన్న ఏ పార్టీ అధికారం శాశ్వతమని అధికారం ఇచ్చిన ప్రజలను కూడా బానిసలుగా చూసే సంప్రదాయానికి  ఒడి గట్టడంతో ప్రభుత్వంలోనూ పార్టీలోనూ ఉన్న నాయకుల్లో ఆధిపత్యం, అహంభావం  పొంగిపోతోంది. ప్రతి పక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాల పై నిర్బంధాలు అణచివేతను కొనసాగిస్తూ ప్రశ్నించేవారు లేకుండా చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ప్రజల మధ్య ఉండాల్సిన బుద్ధిజీవులు, మేధావులు  మానవ పౌర హక్కుల కార్యకర్తలు నేరారోపణ పైనే ఏండ్ల తరబడి జైలు పాలవుతున్నారు. ఇక నేరస్తులు, కార్పొరేటు శక్తులు, పెట్టుబడిదారులు చట్టసభల నిండా చేరి తమ ప్రాబల్యం తో పాటు ఆస్తులను రక్షించుకోవడానికి అధికారంలో కొనసాగుతున్నారు. అలాంటప్పుడు వారు ప్రజల సంక్షేమ, అభివృద్ధి ఎలా కోరతారు?
ప్రజాస్వామ్యం అన్న పదానికే అర్థం లేకుండా..
రాష్ట్రంలో గత నెల రోజులుగా కేంద్ర రాష్ట్ర అధికార పార్టీల మధ్య ఘర్షణ మంటలు రాజుకుంటుంటే ఇతర ప్రతిపక్ష పార్టీలు తమకు సంబంధం లేదని కేవలం ఆ రెండు పార్టీల సమస్యగానే భావించడంతో పాటు ప్రధానమైన సమస్యను రైతులు పండించిన వరిధాన్యం విషయంలో స్పందించాల్సిన స్థాయిలో స్పందించడం లేదు. కేవలం రైతులు పండించిన వరి ధాన్యానికి సంబంధించిన విషమయే కాదు, చేసిన హామీలు, వాగ్దానాలు, రాష్ట్రంలో కొనసాగుతున్న  నిర్భంధాలు, ఆధిపత్యం, అణచివేత, అనుత్పాదక రంగాలపై ఎక్కువగా ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన విధానాలపైనా, నిరుద్యోగం, పేదరికం, ఆకలి చావులు, ఆత్మహత్యలు నిరంతరంగా కొనసాగుతున్నప్పటికీ కార్యాచరణకు పూనుకోక పోవడం ప్రతిపక్షాల బాధ్యతా రాహిత్యమే. ఏ పార్టీకి ఆ పార్టీ తమ ఉనికి కోసం మాత్రమే పోరాటు చేయడం ప్రతికా ప్రకటన ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు. కౌన్సిల్‌ ఎన్నికల విషయంలో, ఇతరత్రా ఉప ఎన్నికలు తదితర సన్నివేశాలలో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని మరిచి ఉన్నత వర్గాలతోనే పదవులు నింపే ఆధిపత్య ధోరణి పట్ల బహుజనులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. హామీ ఇచ్చిన దళిత బంధు అడుగు కూడా జరగలేదు. కొంచెం కూడా ప్రజలను పట్టించుకోని ప్రభుత్వం ఏ వర్గ ప్రయోజనం కోసం పాకులాడుతున్నదో అర్థం కావడం లేదు. ఇవన్నీ చూస్తుంటే అంతకంతకూ ప్రజాస్వామ్య విలువలు దిగజారుతూ ప్రజాస్వామ్యం అన్న పదానికే అర్థం లేకుండా పోతోంది.

- రక్కిరెడ్డి ఆదిరెడ్డి, సోషల్ ఎనలిస్ట్