ప్రాజెక్టు పనులు పక్కనపెట్టి కాల్వలకు లైనింగా?

ప్రాజెక్టు పనులు పక్కనపెట్టి కాల్వలకు లైనింగా?
  •     ఎత్తు పెంపు పనులకు 2015లో రూ.44 కోట్లు శాంక్షన్
  •     అవి పూర్తికాకుండానే కాల్వల లైనింగ్​కు రూ.50 కోట్లు రిలీజ్
  •     ఎత్తు పెంచకుండా కాల్వలు ఎందుకంటున్న రైతులు

మెదక్/పాపన్నపేట, వెలుగు: మెదక్​ జిల్లాలో వింత పరిస్థితి నెలకొంది. ఆరేండ్ల కింద మొదలైన వనదుర్గ ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులు పూర్తి చేయకుండానే కాల్వల లైనింగ్​కు ప్రభుత్వం కొత్తగా ఫండ్స్​ శాంక్షన్​ చేసింది. వాటర్​స్టోరేజీ కెపాసిటీ పెంచకుండా కాల్వలకు లైనింగ్​చేసి ఏం ప్రయోజనమని రైతులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక 2014, డిసెంబర్17న మెదక్​ జిల్లాలోని ఏకైక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు వనదుర్గ(ఘనపూర్ ఆనకట్ట)ను పరిశీలించారు. వందేండ్ల కింద నిర్మించిన ఆనకట్టలో పూడిక పేరుకుపోయిందని, ప్రాజెక్టు ఎత్తు పెంచితే ఆయకట్టు పొలాలకు నీరందించొచ్చని చెప్పారు. ఎత్తు పెంచేందుకు ఫండ్స్​శాంక్షన్​ చేస్తామని ప్రకటించారు. ఇరిగేషన్ ఆఫీసర్లు సర్వే చేసి ఎస్టిమేషన్లు తయారుచేసి ఉన్నతాధికారులకు పంపించారు. 2015లో ఆనకట్ట ఎత్తును 1.7మీటర్లు పెంచేందుకు సర్కారు రూ.43.64 కోట్లు శాంక్షన్ చేసింది. అదే ఏడాది మేలో అప్పటి భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్​రావు శంకుస్థాపన చేశారు.

పూర్తికాని భూసేకరణ
మంత్రి శంకుస్థాపన అనంతరం ఆఫీసర్లు ఆనకట్ట దిగువ భాగంలో ఆప్రాన్ పనులు చేపట్టారు. కానీ ప్రాజెక్టు ఎత్తు పెంచే పనులు మాత్రం షురూ కాలేదు. ఎత్తు పెంచితే పాపన్నపేట మండలంలోని నాగ్సాన్​పల్లి, కొడపాక, చిత్రియాల గ్రామాలు, కొల్చారం మండలంలోని చిన్న ఘనపూర్ గ్రామాల రైతులకు చెందిన 193 ఎకరాల వ్యవసాయ భూమి ముంపునకు గురవుతుంది. పాపన్నపేట మండల పరిధి గ్రామాల్లో భూసేకరణ పూర్తయింది. కానీ ప్రభుత్వం నిర్ణయించిన పరిహారాన్ని చిన్నఘనపూర్ రైతులు అంగీకరించలేదు. ఆ తర్వాత పరిహారం చెల్లించేందుకు ఫండ్స్​లేకపోవడంతో భూసేకరణ ప్రక్రియ ఆగిపోయింది. ఆనకట్ట ఎత్తు పెంపు పనులు పెండింగ్​లో పడ్డాయి. పనులు పనులు మొదలై ఆరేండ్లయినా ఎత్తు పెంచలేదు, వాటర్​స్టోరీ కెపాసిటీ పెరగలేదు. 

వాటిని ఆడ్నే పెట్టి..
పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులను పూర్తిచేయకుండా ప్రభుత్వం తాజాగా వనదుర్గ కాల్వల సిమెంట్​లైనింగ్​కు రూ.50కోట్లు శాంక్షన్ చేసింది. వనదుర్గ ప్రాజెక్టు నుంచి ఆయకట్టు పొలాలకు రెండు ప్రధాన సాగునీటి కాల్వలు ఉన్నాయి. అవే మెహబూబ్​నహర్, ఫతేనహర్​ కాల్వలు. ఇవి రెండూ అధ్వానంగా మారండంతో కొంత కాలంగా ఆయకట్టుకు నీళ్లు అందడం లేదు. గతంలో రిలీజ్​అయిన ఫండ్స్​తో కొంతమేర సిమెంట్​ లైనింగ్ వేశారు. హవేలి ఘనపూర్​మండల పరిధి శాలిపేట నక్కవాగు దగ్గర నుంచి పోచంరాల్​వరకు10 కిలో మీటర్లు, పాపన్నపేట మండలంలోని ఫతేనహర్ కెనాల్​బ్రాంచ్​కెనాల్​కు 27 కిలో మీటర్లు లైనింగ్, దెబ్బతిన్న తూములకు రిపేర్​చేయాల్సి ఉంది. ఈ పనుల కోసం ఇరిగేషన్​ఆఫీసర్లు మూడేళ్ల కిందట ప్రపోజల్స్ పంపగా ప్రభుత్వం ఇప్పుడు మంజూరు చేసింది. ప్రస్తుతం లైనింగ్​పనులు అవసరమే అయినప్పటికీ ఆనకట్ట ఎత్తు పెంచకుండా లైనింగ్ పనులకు ఫండ్స్​శాంక్షన్​ చేయడమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. వాటర్​స్టోరేజీ పెంచకుండా కాల్వలు బాగుచేస్తే ఏం లాభం అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని భూసేకరణ పూర్తిచేయాలని, ఆనకట్ట ఎత్తు పెంచి ఆయకట్టుకు నీళ్లందించాలని రైతులు కోరుతున్నారు.

చెప్పేదొకటి.. చేసేదొకటి 
ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటి. స్వయంగా సీఎం వచ్చి పరిశీలించి ఘనపూర్​ఆనకట్ట ఎత్తు పెంచుతామని చెప్పారు. ఫండ్స్ శాంక్షన్​చేసి ఆరేండ్లయినా భూసేకరణ పూర్తికాలేదు. రైతులకు పరిహారం ఇవ్వకనే ఎత్తు పెంచే పనులు ఆగిపోయాయి. వాటిని పక్కన పెట్టి ఇప్పుడు కాల్వల లైనింగ్ చేపడుతామనడం విడ్డూరంగా ఉంది.
- ప్రభాకర్​ రెడ్డి, కాంగ్రెస్​ కిసాన్ ​సెల్ జిల్లా అధ్యక్షుడు