
- 25 లక్షలు టార్గెట్ పెట్టుకుంటే 55 శాతం మాత్రమే పూర్తి
- ఈ నెల 15 నాటికే ముగిసిన గడువు ..మళ్లీ నెలాఖరుకు పొడిగింపు
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వనమహోత్సవాన్ని బల్దియా అధికారులు లైట్తీస్కున్నారు. ఈ సారి వనమహోత్సవంలో భాగంగా 25,52,599 మొక్కలు నాటాలని బల్దియా టార్గెట్ పెట్టుకుంది. అది కూడా ఈ నెల 15వ తేదీలోపే పూర్తి చేయాలని అనుకుంది. అయితే, గడువులోగా కేవలం 55 శాతం మొక్కలు మాత్రమే నాటగలిగింది. కొన్ని జోన్లలో అయితే వన మహోత్సవం సంగతే మర్చిపోయారు.
కూకట్ పల్లి, సికింద్రాబాద్ జోన్లలో 50 శాతం కూడా మొక్కలు నాటలేదు. మాన్సూన్ ప్రిపరేషన్, వరుస సెలవులు రావడంతోనే ఆలస్యం జరిగిందని కొందరు సర్కిల్ స్థాయిలో ఉండే మేనేజర్లు, జోనల్ స్థాయిలో ఉండే డిప్యూటీ డైరెక్టర్లు చెప్తున్నారు. కొన్ని సర్కిల్స్ లో ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన సమాచారం డిప్యూటీ కమిషనర్ల వరకు చేరలేదని తెలిసింది. అనుకున్న తేదీలోగా టార్గెట్ పూర్తికాకపోవడంతో ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని మరో టార్గెట్ పెట్టుకున్నట్టు తెలిసింది.
గ్రేటర్ లో 8.18 చదరపు మీటర్ల గ్రీనరీ
గ్రేటర్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం ప్రతి మనిషికి 9 చదరపు మీటర్ల పచ్చదనం అవసరముంటుంది. అయితే, నగరంలో ఇప్పుడు 8.18 చదరపు మీటర్ల గ్రీనరీ మాత్రమే ఉందని జీహెచ్ఎంసీ లెక్కలు చెప్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రేటర్ లో 69 లక్షల జనాభా ఉండగా, ప్రస్తుతం కోటికి చేరింది.
కోటిమందిలో ఒక్కొక్కరి చొప్పున 8.18 చదరపు మీటర్ల గ్రీనరీ ఉండగా 8,18,00,000 చదరపు మీటర్ల పచ్చదనం ఉంది. అంటే ఇంకా 82 లక్షల చదరపు మీటర్ల గ్రీనరీ తక్కువగా ఉంది. దీన్ని ఫుల్ ఫిల్ చేసేందుకు మొక్కలను నాటాల్సి ఉంది. అదేవిధంగా 33 శాతం అటవీ ప్రాంతం ఉండాల్సి ఉన్నా, గ్రేటర్ లో 12.8 శాతం మాత్రమే ఫారెస్ట్ ఉంది. ఇతర మెట్రో పాలిటన్ సిటీలతో పోలిస్తే హైదరాబాద్ లో అటవీ శాతం పర్వాలేదని అధికారులు అంటున్నారు.