వందే భారత్ రైలు 9 గంటలు ఆలస్యమా.?.. నిజంగా ఆశ్చర్యంగా ఉందే..

వందే భారత్ రైలు 9 గంటలు ఆలస్యమా.?.. నిజంగా ఆశ్చర్యంగా ఉందే..

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, వేగవంతమైన రైలుగా పేరు తెచ్చుకున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు ఘోర అవమానం జరిగింది. ఎర్నాకుళం - బెంగళూరు (రైలు నంబర్ 20632) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సాంకేతిక లోపాల కారణంగా ఏకంగా 9 గంటలకు పైగా ఆలస్యంగా నడిచింది. దీంతో ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో, రైలు బోగీల్లో తీవ్ర నరకాన్ని అనుభవించారు.

నిజానికి ఈ రైలు జూన్ 6 సాయంత్రం 5:20 గంటలకు ఎర్నాకుళం జంక్షన్ నుండి బయలుదేరాల్సి ఉంది. కానీ సాంకేతిక లోపం తలెత్తడంతో రైలు కదలలేదు. రాత్రి 11 గంటలైనా రైలు బయలుదేరకపోవడంతో ప్రయాణికుల సహనం నశించింది. చివరకు అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో రైల్వే అధికారులు ప్రత్యామ్నాయంగా  మరో రేక్‌ను ఏర్పాటు చేసి రైలును పంపించారు.

అయితే, ప్రయాణం మధ్యలో కూడా తిరుప్పూర్ సమీపంలో మరోసారి సాంకేతిక సమస్య రావడంతో రైలు గంటన్నర పాటు ట్రాక్‌పైనే నిలిచిపోయింది. ఆ సమయంలో రైల్లో ఏసీలు కూడా పనిచేయకపోవడంతో, ఊపిరాడక ప్రయాణికులు, చిన్న పిల్లలు తీవ్ర అవస్థలు పడ్డారు.జూన్ 7 ఉదయం 4:30 గంటలకు బెంగళూరు చేరుకోవాల్సిన ఈ రైలు... ఏకంగా 9 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 1:45 గంటలకు చేరుకుంది.

►ALSO READ | ఒమన్ తీరంలో హైటెన్షన్: భారతీయ నావికులతో వెళ్తున్న షిప్‌లపై దాడులు.. వారంలో మూడోసారి

వేల రూపాయలు పెట్టి ప్రీమియం టికెట్లు కొనుక్కుంటే రైల్వే శాఖ కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైలు గంటల తరబడి ఆలస్యమవుతున్నా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం కూడా సరిగ్గా సరఫరా చేయలేదని సోషల్ మీడియా వేదికగా రైల్వే శాఖపై మండిపడుతున్నారు.

అయితే ఎర్నాకుళం వచ్చే సమయంలోనే రైలులో సాంకేతిక లోపం తలెత్తిందని ప్రయాణికుల భద్రత దృష్ట్యా, లోపాన్ని సరిచేసేందుకే సమయం పట్టిందని  రైల్వే అధికారులు క్లారిటీ ఇచ్చారు.