- పురుషుల విభాగంలో రజతం సాధించిన రిషికాంత సింగ్
- దేశ ఖ్యాతిని చాటిన మణిపూర్ మట్టిబిడ్డలు
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ సైఖోమ్ మీరాబాయీ చాను వరుసగా మూడోసారి బంగారు పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. మహిళల 48 కేజీల విభాగంలో స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 105 కేజీలు చొప్పున మొత్తం 190 కేజీల బరువెత్తి స్వర్ణం సాధించింది. 60 కేజీల విభాగంలో రిషికాంత సింగ్ రజత పతకం సాధించాడు. వీరిద్దరూ మణిపూర్వాసులే కావడం విశేషం.
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత వెయిట్‌లిఫ్టర్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. ఒలింపిక్ పతక విజేత సైఖోమ్ మీరాబాయి చాను వరుసగా మూడోసారి కామన్వెల్త్ స్వర్ణ పతకాన్ని ముద్దాడి చరిత్ర సృష్టించింది. మరో వెయిట్‌లిఫ్టర్ రిషికాంత సింగ్ మోకాలి గాయంతో పోరాడి రజత పతకం కైవసం చేసుకున్నాడు. కాగా వీరిద్దరూ మణిపూర్రాష్ట్రానికి చెందినవారు కావడం విశేషం. మహిళల 48 కేజీల విభాగంలో బరిలోకి దిగిన మీరాబాయి రికార్డుల మోత మోగించింది. పోటీ ప్రారంభంలోనే స్నాచ్‌లో 82 కేజీలు ఎత్తడంలో విఫలమైనప్పటికీ, వెంటనే పుంజుకుని సత్తా చాటింది. క్లీన్ అండ్ జెర్క్‌లోనూ తొలి ప్రయత్నం ఫెయిల్ అయినప్పటికీ, రెండో ప్రయత్నంలో 105 కేజీలు ఎత్తి స్వర్ణాన్ని ఖరారు చేసుకుంది. స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 105 మొత్తం 190 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్ రికార్డులను తన పేరు మీదకు మార్చుకుంది. నైజీరియా అథ్లెట్ రుత్ అసుక్వో న్యాంగ్ కంటే ఏకంగా 22 కేజీలు అధికంగా బరువెత్తి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
రిషికాంత సింగ్ అద్భుత ప్రదర్శన
అంతకుముందు, పురుషుల 60 కేజీల విభాగంలో రిషికాంత సింగ్ అద్భుత ప్రదర్శనతో రజతం సాధించాడు. స్నాచ్‌లో 121 కేజీలు ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డును సమం చేసిన ఆయన, క్లీన్ అండ్ జెర్క్‌లో మోకాలి గాయం ఇబ్బంది పెట్టినప్పటికీ పోరాడి మొత్తం 264 కేజీల బరువుతో రెండో స్థానంలో నిలిచాడు. మణిపూర్ నుంచి కామన్వెల్త్ పతకం సాధించిన తొలి పురుష వెయిట్‌లిఫ్టర్‌గా ఆయన రికార్డు సృష్టించాడు. ఇదిలాఉంటే లాన్ బౌల్స్ మహిళల జోడీ మ్యాచ్‌లో స్వల్ప తేడాతో నమీబియా చేతిలో ఓటమి చవిచూసింది.
మూడో భారత అథ్లెట్ మీరా
కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి వరుసగా మూడో గోల్డ్ మెడల్ సాధించింది. 2018 (గోల్డ్ కోస్ట్), 2022 (బర్మింగ్‌హామ్) కామన్వెల్త్ క్రీడల్లోనూ ఆమె స్వర్ణ పతకం సాధించింది. రెజ్లర్లు సుశీల్ కుమార్ (2010, 2014, 2018), వినేశ్ ఫొగాట్ (2014, 2018, 2022) తర్వాత కామన్వెల్త్ క్రీడల్లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించిన మూడో భారత అథ్లెట్‌గా చాను రికార్డు సృష్టించింది. అంతేకాదు కామన్వెల్త్ క్రీడల్లో ఇప్పటివరకు అత్యధిక బరువు ఎత్తిన మహిళా లిఫ్టర్ సైతం మీరానే.
మీరాబాయికి ప్రధాని మోదీ, ప్రముఖుల అభినందనలు
హ్యాట్రిక్ స్వర్ణ పతకాలు సాధించిన వెయిట్‌లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయి చానుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇది భారత వెయిట్‌లిఫ్టింగ్ చరిత్రలో మరో అద్భుత అధ్యాయమని కొనియాడారు. మహిళల 48 కేజీల విభాగంలో ఆమె సాధించిన విజయం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని ఎక్స్‌లో తెలిపారు. పురుషుల 60 కేజీల విభాగంలో రజతం గెలుచుకున్న రిషికాంత సింగ్ పట్టుదలను ప్రధాని అభినందించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా మీరాబాయి అంకితభావం దేశానికి గర్వకారణమని అభినందనలు తెలిపారు.
