జ్ఞానవాపి ఆవరణలో.. సైంటిఫిక్ సర్వేకు ఓకే

జ్ఞానవాపి ఆవరణలో.. సైంటిఫిక్ సర్వేకు ఓకే
  • ఏఎస్‌‌ఐకి పర్మిషన్ ఇచ్చిన వారణాసి జిల్లా కోర్టు
  • శివలింగం ఉన్నట్లుగా భావిస్తున్న ‘వజుఖానా’కు మినహాయింపు
  • ఆగస్టు 4 కల్లా రిపోర్టును అందజేయాలని ఆదేశం

న్యూఢిల్లీ: జ్ఞానవాపి విషయంలో వారణాసి జిల్లా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మసీదు ఆవరణ మొత్తాన్ని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌‌ఐ) ద్వారా సైంటిఫిక్ సర్వే చేయించేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఆగస్టు 4వ తేదీ నాటికల్లా సైంటిఫిక్ రిపోర్టును తమకు అందజేయాలని ఆదేశించింది. అయితే శివలింగం ఉన్నట్లుగా భావిస్తున్న, బారికేడ్ ఏర్పాటు చేసిన ‘వజుఖానా’ను మాత్రం ఈ సర్వే నుంచి మినహాయించింది. విచారణను ఆగస్టు 4 వ తేదీకి వాయిదా వేసింది. ‘వజుఖానా’ మొత్తం సీల్ చేయాలని గతేడాది సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ‘‘నా పిటిషన్‌‌ను విచారణకు స్వీకరించినట్లు సమాచారం వచ్చింది. సీల్ చేసిన వాజు ట్యాంక్ తప్ప మిగతా మసీదు కాంప్లెక్స్‌‌లో సర్వే చేయాలని కోర్టు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది” అని పిటిషనర్ల తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ చెప్పారు.

సర్వేతోనే వివాదం ముగుస్తది: పిటిషనర్లు

గతంలో హిందూ ఆలయం ఉన్న ప్రాంతంలోనే మసీదును కట్టారా? లేదా? అనే విషయాన్ని తేల్చాలంటూ వారణాసి కోర్టులో నలుగురు మహిళా భక్తులు పిటిషన్ దాఖలు చేశారు. ‘‘కాశీ విశ్వనాథ ఆలయానికి దగ్గర్లోని జ్ఞానవాపి మసీదులో పురాతన హిందూ ఆలయాల ఆనవాళ్లు ఉన్నాయి. అందులో స్వయంభు జ్యోతిర్లింగం ఉంది. కానీ ముస్లిం ఆక్రమణదారులు అనేకసార్లు దాన్ని ధ్వంసం చేశారు” అని పిటిషన్‌‌లో ఆ మహిళలు పేర్కొన్నారు. ‘‘అత్యంత మతోన్మాద, క్రూరమైన మొఘల్ చక్రవర్తుల్లో ఒకరైన ఔరంగజేబు.. అక్కడ ఉన్న ఆదివిశ్వేశ్వరుని ఆలయాన్ని కూల్చివేసేందుకు 1669లో ఫర్మాన్‌‌ జారీ చేశాడు. అతని అనుచరులు ఆలయాన్ని కూల్చివేశారు” అని చెప్పారు. కేవలం ఆర్కియోలాజికల్ దర్యాప్తు ఆధారంగానే జ్ఞానవాపి మసీదు వివాదం ముగుస్తుందని లాయర్ జైన్ చెప్పారు. అయితే ఏఎస్‌‌ఐ సర్వే చేస్తే మసీదు కాంప్లెక్స్‌‌ దెబ్బతింటుందని మసీదు కమిటీ వాదించింది.

  • జ్ఞానవాపి మసీదు కేసు పూర్వాపరాలివీ

  •  జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కొందరు పూజారుల బృందం 1991లో కోర్టును ఆశ్రయించింది. 
  • కాశీ విశ్వనాథ్ మందిర్– జ్ఞానవాపి మసీదు కేసు విచారణను వారణాసి కోర్టులో నిలిపేయాలంటూ 2021లో అలహాబాద్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మసీదును నిర్మించడానికి హిందూ దేవాలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారా? లేదా? అనేది నిర్ధారించేందుకు ప్రాంగణంలో చేపట్టిన పురావస్తు సర్వేను నిలిపివేయాలని ఉత్తర్వులిచ్చింది.
  •  జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని శ్రీనగర్ గౌరి, ఇతర విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఐదుగురు మహిళలు గతేడాది కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. మసీదు కాంప్లెక్స్‌‌లో వీడియో సర్వే చేయాలని ఆదేశించింది. సర్వే రిపోర్టును మే 10న అందజేయాలని సూచించింది. 
  •  సర్వే మే 16న పూర్తయింది. సర్వే సందర్భంగా మసీదు కాంప్లెక్స్‌‌ లోపలున్న ఫౌంటెయిన్‌‌లో శివలింగం కనిపించిందంటూ హిందూ పిటిషనర్లు చెప్పారు. అయితే దీన్ని ముస్లిం ప్రతివాదులు ఖండించారు. లోపలున్నది కేవలం ఫౌంటెయిన్ మాత్రమేనని చెప్పారు.
  • ఈ నేపథ్యంలో గత మే నెలలో మరో నలుగురు మహిళలు వారణాసి కోర్టును ఆశ్రయించారు. హిందూ, ముస్లిం పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును 14వ తేదీన రిజర్వు చేసింది. తాజాగా తీర్పు చెప్పింది. 

శ్రీకృష్ణ జన్మభూమి -షాహీ ఈద్గా వివాదం’పైరిపోర్ట్ ఇవ్వండి

శ్రీకృష్ణ జన్మభూమి – షాహీ ఈద్గా వివాదానికి సంబంధించి దాఖలైన సూట్ల వివరాలను తమకు అందజేయాలని అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌‌కు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. మధుర కోర్టులో పెండింగ్‌‌లో ఉన్న వివాదానికి సంబంధించిన అన్ని విషయాలను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌‌ను  సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ ఎస్‌‌కే కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన బెంచ్ విచారించింది.ఈ వ్యవహారాన్ని హైకోర్టు స్థాయిలోనే పరిష్కరిస్తే మంచిదని ఈ సందర్భంగా జస్టిస్ కౌల్ అభిప్రాయపడ్డారు.