ఆర్ఎస్ ప్రవీణ్ విమర్శలు సిగ్గుచేటు : వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు

ఆర్ఎస్ ప్రవీణ్ విమర్శలు సిగ్గుచేటు : వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర గీతానికి ఎవరితో మ్యూజిక్ చేయించాలనే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అందెశ్రీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. కీరవాణి అంతర్జాతీయ స్థాయిలో గొప్ప దర్శకుడని, అలాంటి కీరవాణికి మ్యూజిక్ డైరెక్టర్ గా అందెశ్రీ అవకాశం ఇస్తే.. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్ విమర్శలు చేయడం సిగ్గుచేటని ​ఆయన ఫైర్ అయ్యారు. వారిని విమర్శించే స్థాయి అతనికి లేదని ఆయన అన్నారు. 

మంగళవారం గాంధీ భవన్ లో నాగరాజు మీడియాతో మాట్లాడారు. సమంత, పుల్లెల గోపీచంద్, మంచు లక్ష్మి లాంటి వాళ్లకు కేసీఆర్ పాలనలో బ్రాంబ్​అంబాసిడర్లుగా అవకాశాలు ఇచ్చినప్పుడు.. వాళ్లు ఏ ప్రాంతం వారో గుర్తుకురాలేదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్ గుండు చేయించుకున్నంత మాత్రాన ఆయన బుద్దిస్ట్, అంబేద్కరిస్ట్ కాలేడని విమర్శించారు. ‘‘ఏనుగెక్కి ప్రగతి భవన్ కు పోదామన్న ప్రవీణ్.. ఇప్పుడు ఎక్కడికి పోయిండు.. ఆయన ఏనుగు ఎక్కడికి పోయింది.. ఏనుగు దిగి కారెక్కిండు”అని ఆయన ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికే ప్రవీణ్​బీఆర్ఎస్ లో చేరారని, ఆయన బీఆర్ఎస్ లో చేరక ముందు నుంచే కేసీఆర్ వదిలిన బాణం అని ఆరోపించారు.