
క్యాప్సికం అంటే చాలు ఆమడ దూరం పరిగెడతారు పిల్లలు. ఒకవేళ బలవంతంగా తినిపించే ప్రయత్నం చేసినా అయిష్టంగానే ఒకటిరెండు ముద్దలు తింటారు. పిల్లలే కాదు కొందరు పెద్దలు కూడా క్యాప్సికం తినడానికి పెద్దగా ఆసక్తి చూపరు. అలాంటివాళ్లకి ఒక్కసారి ఈ యమ్మీ అండ్ హెల్దీ క్యాప్సికం స్పెషల్ రెసిపీలు వండిపెట్టండి. నిమిషాల్లో ప్లేట్ ఖాళీ చేయడం ఖాయం..
క్యాప్సికం ఫ్రై తయారీకి కావాల్సినవి
- క్యాప్సికం ముక్కలు- ఒక కప్పు
- పుట్నాల పప్పు – పావుకప్పు
- ఎండుమిర్చి- పది
- వెల్లుల్లి- నాలుగు రెబ్బలు
- జీలకర్ర – ఒక టీ స్పూన్
- జీడిపప్పు- కొద్దిగా
- ఉప్పు- తగినంత
- కరివేపాకు- రెండు రెమ్మలు
- పోవు దినుసులు- ఒక టీ స్పూన్
- నూనె- మూడు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం: ముందుగా జీలకర్ర, వెల్లుల్లి సగం ఎండుమిర్చి వేగించి పుట్నాల పప్పు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడిలా చేయాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసి పోపు దినుసులు, కరివేపాకు, మిగిలిన ఎండుమిర్చి.. క్యాప్సికం ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగించాలి. మిశ్రమం కాస్త దగ్గరపడ్డాక ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలపాలి. ఆపై వేగించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే క్యాప్సికం ఫ్రై రెడీ..
మసాలా క్యాప్సికం తయారీకి కావలసినవి
- క్యాప్సికం ముక్కలు -రెండు టేబుల్ స్పూన్లు
- ధనియాలు-రెండు టీ స్పూన్లు
- ఎండుకొబ్బరి- ఒక టేబుల్ స్పూన్
- ఎండుమిర్చి- రెండు
- నువ్వులు- ఒక టీ స్పూన్
- వేరు శెనగలు-పావు కప్పు
- జీలకర్ర- అర టీ స్పూన్
- ఉల్లిగడ్డ తరుగు - అర టేబుల్ స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ –ఒక టేబుల్ స్పూన్
- కారం –అరటీ స్పూన్
- పసుపు –పావు టీ స్సూన్
- నూనె –సరిపడ
- ఉప్పు – తగినంత
తయారీ విధానం: పాన్ వేడి చేసి వేరు శెనగలు వేగించి పక్కనుంచాలి. ఆదేపాన్ లో ధనియాలు, ఎండుకొబ్బరి, నువ్వులు, ఎండుమిర్చి వేసి వేగించాలి. చల్లారాక వేరుశెనగలతో పాటు మిక్సీ జార్లో వేసి పొడి చేయాలి. మరొక పాన్ లో కొద్దిగా నూనె వేడిచేసి జీలకర్ర, ఉల్లిగడ్డ తరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్ చేసి వేగించాలి. తర్వాత క్యాప్సికం.. తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి మరికాసేపు మగ్గించాలి. అలాగే మిక్సీ పట్టిన మసాలా పొడి కూడా వేసి కలపాలి. కాసేపయ్యాక కొన్ని నీళ్లు పోసి చిన్న మంటపై ఉడికించాలి. మిశ్రమం చిక్కబడ్డాక స్టవ్ ఆపాలి. క్యాప్సికం మసాలా చపాతీల్లోకి బాగుంటుంది.
క్యాప్సికం పరాటా తయారీకి కావలసినవి
- క్యాప్సికం– నాలుగు
- పెరుగు - పావు కప్పు
- పుట్నాల పప్పు - పావు కప్పు
- గరం మసాలా- పావు టీ స్పూన్,
- ఉప్పు - తగినంత
- గోధుమపిండి- రెండు కప్పులు
- నూనె - తగినంత
- చీజ్ ప్లైన్లు- తగినన్ని
తయారీ విధానం: క్యాప్సికం శుభ్రంగా కడిగి, మిక్సీ పట్టి పేస్ట్ లా చేసి గిన్నెలోకి తీయాలి. అందులో పెరుగు గరం మసాలా, ఉప్పు, గోధుమ పిండి వేసి చపాతీ పిండిలా కలపాలి. ఆ మిశ్రమంపై తడి బట్ట చుట్టి పదిహేను నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీల్లా ఒత్తి పెనంపై నూనెతో రెండువైపులా ఒక్కో చపాతీ మీద ఒక్కో ఛీజ్ స్లైస్ వేసి రోల్ చేసుకొని తింటే భలే ఉంటుంది.
క్యాప్సికం పచ్చడి తయారీకి కావలసినవి
- క్యాప్సికం ముక్కలు – ఒకటిన్నర కప్పు
- పల్లీలు – అరకప్పు
- ఎండుమిర్చి- పదిహేను
- నూనె- వందగ్రాములు
- లవంగాలు- మూడు
- వెల్లుల్లి- నాలుగు రెబ్బలు
- పసుపు- చిటికెడు
- ఉప్పు- తగినంత
- చింతపండు రసం- మూడు టేబుల్ స్పూన్లు
- ఆవాలు, జీలకర్ర- ఒక్కోటి ఒక టీ స్పూన్
తయారీ విధానం : పాన్ లో నూనె వేడి చేసి పల్లీలు.. ఎండుమిర్చి వేసి వేగించాలి. చల్లారాక మిక్సీ పట్టి పొడి చేయాలి. అదే పాన్ లో ఇంకాస్త నూనె పోసి కాగాక లవంగాలు వెల్లుల్లి వేసి వేగించాలి. అందులో క్యాప్సికం ముక్కలు కూడా వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. తర్వాత పసుపు, ఉప్పు, చింతపండు రసం వేసి ఐదు నిమిషాలు ఉడికించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాతపల్లీల పొడి వేసిమరోమారు మిక్కిపట్టాలి. చివరిగా పాన్ లో నూనె వేడిచేసి ఆవాలు.. జీలకర వేసి వేగించాలి. ఆ మిశ్రమాన్ని పచ్చడిలో పోసి బాగా కలపాలి
కాజూ క్యాప్సికం తయారీకి కావలసినవి
- గ్రీన్ క్యాప్సికం ముక్కలు - ఒక కప్పు
- రెడ్ క్యాప్సికం ముక్కలు - అర కప్పు
- పాలు - అర కప్పు
- ఉల్లిగడ్డ తరుగు - ఒక కప్పు
- వెల్లుల్లి- పదిహేను రెబ్బలు
- పసుపు, జీలకర్ర- ఒక్కోటి ఒకటీస్పూన్ చొప్పున
- కారం- తగినంత
- గరం మసాలా- అర టీ స్పూన్
- జీలకర్ర పొడి - పావు టీ స్పూన్
- గసగసాలు- ముప్పావు టీ స్పూన్
- కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూన్
- జీడిపప్పు- పావు కప్పు
- ఉప్పు- తగినంత
- నూనె- పావుకప్పు
తయారీ విధానం: జీడిపప్పు, గసగసాలలో సరిపడా నీళ్లు పోసి గంట పాటు నానబెట్టాలి . మిక్సీ జార్ లో కొబ్బరి తురుము, వెలుల్లి, నానబెట్టిన జీడిపప్పు, గసగసాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ చేయాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసి జీలకర్ర, ఉల్లిగడ్డ తరుగు వేసి వేగించాలి. అందులో క్యాప్సికం. ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, గరంమసాలా, జీలకర్రపొడి కూడా వేసి బాగా కలిపి మూతపెట్టాలి. క్యాప్సికం మగ్గాక పాలు, ముందుగా సిద్దం చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలపాలి. గ్రేవీల అయ్యాక స్టవ్ ఆపి వేడివేడిగా తింటే రుచి అదిరిపోతుంది