రకరకాల కారప్పొడులు

రకరకాల కారప్పొడులు

ఒక్కోసారి ఏది తిన్నా నోటికి రుచిగా అనిపించదు. అలాంటప్పుడు వేడి వేడి అన్నంలో కాస్త కారప్పొడి, అందులో నెయ్యి వేసుకుని తింటే.... ‘‘ఆహా!”అనాల్సిందే. ఇప్పటికే చాలామంది ఎన్నో రకాల కారప్పొడులు రుచి చూసుంటారు. కానీ, వాటన్నింటిదీ ఒక రూట్​... ఇక్కడిచ్చిన వాటిది వేరే రూట్. ఎందుకంటే ఇవి వెజ్​, నాన్​వెజ్​తో పాటు పది రకాల ఆకుకూరలతో చేసిన కారప్పొడులు. పైగా ఒక్కరోజులో అయిపోయేవి కాదు... రెండు వారాల నుంచి ఏడాది పాటు నిల్వ ఉంటాయి కూడా.

బీరకాయ పొట్టు కారం

కావాల్సినవి : 

బీరకాయల పొట్టు – రెండు కప్పులు
ఎండు మిర్చి – పది, మినప్పప్పు – రెండు టీస్పూన్లు
నూనె – సరిపడా, వాము – ఒక టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు – ఏడు, చింతపండు – కొద్దిగా

తయారీ :

బీరకాయ పొట్టు, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ఒక పాన్​లో నూనె వేడి చేసి ఎండు మిర్చి, మినప్పప్పు వేగించి పక్కన పెట్టాలి. అదే పాన్​లో మరికొంచెం నూనె వేసి బీరకాయ పొట్టు వేగించాలి. వేగిన బీరకాయ పొట్టులో వాము వేసి కలపాలి. ఒక మిక్సీజార్​లో వేగించిన మిర్చి, మినప్పప్పు, చింతపండు, వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులో వేగించిన బీరకాయ పొట్టు కూడా వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. దీన్ని నిల్వ చేసుకుని  వాడుకోవచ్చు. 


దొండకాయ కారప్పొడి

కావాల్సినవి : 

దొండకాయలు – పది, ఉప్పు – సరిపడా
నూనె – రెండు టీస్పూన్లు, పల్లీలు – పావు కప్పు
పసుపు – పావు టీస్పూన్, కారం – ఒక టీస్పూన్ 
వెల్లుల్లి రెబ్బలు – ఐదు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి తురుము, కరివేపాకు – ఒక్కోటి టేబుల్ స్పూన్ చొప్పున

తయారీ :

దొండకాయలు తురిమి, అందులో ఉప్పు కలిపి, పదినిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత దొండకాయల్లో నీళ్లు పిండేయాలి. ఒక పాన్​లో పల్లీలు వేగించి పక్కన పెట్టాలి. తరువాత అదే పాన్​లో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి తురుము, కరివేపాకు వేసి వేగించాలి. వాటితోపాటు మిక్సీజార్​లో కారం, పసుపు, ఉప్పు, వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్ చేయాలి. పాన్​లో నూనె వేడి చేసి, అందులో దొండకాయ తురుము వేసి బ్రౌన్​ కలర్​ వచ్చేవరకు వేగించాలి. ఆ తర్వాత అదే నూనెలో పొడికారం వేసి వేగించాలి. చివరిగా పొడికారం, దొండకాయ వేగించిన తురుము రెండింటినీ కలపాలి. 


ఆకుకూరలతో..

కావాల్సినవి :

పాలకూర, మెంతి, పొన్నగంటి, గోంగూర, గంగవాయిల, కోయ తోటకూర, కొత్తిమీర, కరివేపాకు, తోటకూర, మునగాకు – ఒక్కోటి ఒక్కో కట్ట చొప్పున, పల్లీలు, కంది పప్పు, పెసరపప్పు – అర కప్పు, శనగపప్పు – పావు కప్పు, ఎండు మిర్చి – పది లేదా పదిహేను, ధనియాలు, జీలకర్ర – ఒక్కోటి టీస్పూన్​ చొప్పున, వెల్లుల్లి – ఎనిమిది
ఉప్పు – సరిపడా, పుట్నాలు – పావు కప్పు

తయారీ :

ఆకు కూరల్ని శుభ్రంగా కడిగి, తడి ఆరబెట్టాలి. తరువాత వాటిని వేగించాలి. అదే పాన్​లో పల్లీలను వేగించాలి. ఆ తర్వాత  కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు కలిపి ఒకేసారి వేగించాలి. ఎండు మిర్చి, ధనియాలు, జీలకర్ర వాటిలోనే వేయాలి. వేగించినవన్నీ ఒక్కోటిగా మిక్సీజార్​లో వేసి గ్రైండ్ చేయాలి. చివర్లో పుట్నాలు వేగించి చల్లారాక వాటిని కూడా గ్రైండ్ చేయాలి. ఇది ఫ్రిజ్​లో పెడితే రెండు నెలలు నిల్వ ఉంటుంది. 

మటన్ పొడి కారం

కావాల్సినవి :

బోన్​లెస్​ మటన్ – ఒక కప్పు
నూనె – సరిపడా
పచ్చి శనగపప్పు, ధనియాలు – ఒక్కోటి టీస్పూన్ చొప్పున
లవంగాలు – ఆరు
యాలకలు – నాలుగు
దాల్చిన చెక్క – ఒకటి
జాపత్రి – కొద్దిగా
పసుపు – పావు టీస్పూన్
కారం – ఒక టీస్పూన్
ఉప్పు – సరిపడా

తయారీ :

బాండీ​లో నూనె వేడి చేసి, అందులో చిన్న చిన్నగా కోసిన మటన్ ముక్కలు వేసి క్రిస్పీగా వేగించాలి. మటన్ ముక్కలు చల్లారాక, పొడి చేయాలి.  ఒక పాన్​లో శనగపప్పు, ధనియాలు, జాపత్రి, యాలకలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేగించాలి. వీటితోపాటు మిక్సీజార్​లో వేగించిన మటన్ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేయాలి. ఆ పొడిని ప్లేట్​లోకి తీసుకుని, చల్లారాక డబ్బాల్లో పెట్టుకోవాలి. 

చికెన్​ కారప్పొడి

కావాల్సినవి :

బోన్​ లెస్ చికెన్ – పావుకిలో
అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు టీస్పూన్లు
పసుపు – టీ స్పూన్
కారం – ఒక టేబుల్ స్పూన్
ఉప్పు – సరిపడా
నీళ్లు – ఒక గ్లాస్
ధనియాలు – రెండు టీస్పూన్లు
జీలకర్ర – ఒక టీస్పూన్
ఎండు మిర్చి – పది 
గరం మసాలా – ఒక టీస్పూన్
బియ్యప్పిండి – పావు కప్పు 

తయారీ :


చికెన్​లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి, నీళ్లు పోసి ఉడికించాలి. ఒక పాన్​లో నూనె వేసి, చికెన్​ మిశ్రమాన్ని వేగించాలి. మరో పాన్​లో ఎండు మిర్చి, ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి, వెల్లుల్లి ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించాలి. వాటితోపాటు చింతపండు, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత వేగించిన చికెన్​ ముక్కల్లో గరం మసాలా కలపాలి. అందులో బియ్యప్పిండి వేసి కలిపి, జల్లెడ పట్టాలి. ఒక బాండీలో నూనె వేడి చేసి చికెన్​ ముక్కల్ని క్రిస్పీగా వేగించాలి.  చివరిగా వాటిలో రెడీ చేసిపెట్టిన కారప్పొడి వేసి కలపాలి. లేదా చికెన్​ ముక్కలు కూడా మిక్సీ పట్టి, కలపొచ్చు.

ఎండు రొయ్యల పొడి

కావాల్సినవి :
ఎండు రొయ్యలు – ఒక కప్పు
ఎండు మిర్చి – ఇరవై ఐదు
నూనె – రెండు టీస్పూన్లు
ఎండు కొబ్బరి – అర కప్పు
వెల్లుల్లి రెబ్బలు – ఎనిమిది
ధనియాలు – రెండు టీస్పూన్లు
జీలకర్ర – అర టీస్పూన్ 
చింతపండు – పావు కప్పు
ఉప్పు – సరిపడా

తయారీ :
రొయ్యలను నూనె లేకుండా వేగించాలి. తరువాత అదే పాన్​లో నూనె వేడి చేసి, ఎండు మిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించాలి. వాటిని కూడా తీసి మరో ప్లేట్​లో పెట్టాలి. మరోసారి పాన్​లో ఎండు కొబ్బరి వేగించాలి. ఆ తర్వాత వేగించిన ఎండుమిర్చి మిశ్రమాన్ని మిక్సీజార్​లో మెత్తగా పొడిచేయాలి. ఆ తర్వాత అందులో ఎండుకొబ్బరి, చింతపండు వేసి మిక్సీ పడితే, కారప్పొడి రెడీ. చివరగా వేగించిన రొయ్యల్ని చేత్తో పొడిచేసి, కారప్పొడిలో కలపాలి.