టీఆర్ఎస్ ధర్నాలకు బందోబస్తు, మాపై జులుమా

టీఆర్ఎస్ ధర్నాలకు బందోబస్తు, మాపై జులుమా
  • రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కలెక్టరేట్ల ముట్టడి
  • సిరిసిల్లలో ఉద్రిక్తత, ఒకరికి తీవ్ర అస్వస్థత
  • జనం చూస్తున్నరు: పోలీసులపై లీడర్ల ధ్వజం
  • వికారాబాద్ కలెక్టర్ చాంబర్లో ఆందోళనలు

హైదరాబాద్​/ వెలుగు నెట్ వర్క్: కమలదళం కదం తొక్కింది. పెట్రోల్, డీజిల్​పై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వ్యాట్ తగ్గించాలనే డిమాండ్​తో శనివారం అన్ని జిల్లాల్లోనూ బీజేపీ ఆందోళనలు చేసింది. ఎక్కడికక్కడ కలెక్టరేట్లను ముట్టడించి ధర్నాలు చేసింది. పలు జిల్లల్లో ఉద్రిక్తతలు, పోలీసులతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి.శనివారం సిరిసిల్ల కలెక్టరేట్ ముందు ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. లీడర్లు కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇనుప కంచెను దాటుకొని వెళ్లే ప్రయత్నంలో పలువురు గాయపడ్డారు. దాసరి గణేశ్ అనే కార్యకర్తను కానిస్టేబుల్ మెడ పట్టుకొని లాక్కుపోయాడు. దాంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని జెడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ పరామర్శించారు. గణేశ్ ఆరోగ్యం క్షీణించడంతో తన వెహికిల్స్​లో సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు జులుం చేస్తున్నారని ఈ సందర్భంగా లీడర్లు మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తున్నది. జనం అన్నీ చూస్తున్నారు. టీఆర్ఎస్ లీడర్లు ధర్నా చేస్తే పోలీసులు సపోర్టు చేస్తున్నారు. బీజేపీ లీడర్లు చేస్తే అరెస్టులు చేస్తున్నారు” అంటూ ఫైరయ్యారు. కేసీఆర్ ఇటు వ్యాట్ తగ్గియ్యడం లేదు, అటు కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు తడిసి ముద్దవుతున్నా రైతులను పట్టించుకోవడం లేదనిబీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రం మహేశ్ మండిపడ్డారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాహుల్ హెగ్డేకు లీడర్లు వినతిపత్రమిచ్చారు.

రాజధానిలోనూ రగడ...
బీజేపీ హైదరాబాద్ చీఫ్ గౌతం రావు, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్ తదితరుల ఆధ్వర్యంలో పార్టీ కార్పొరేటర్లు, లీడర్లు, కార్యకర్తలు సిటీ కలెక్టరేట్ ముందు నిరసనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేసీఆర్ కు, టీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చాలా రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించినా, కేసీఆర్ తగ్గించలేదని మండిపడ్డారు. అందుకే పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్నాయన్నారు. తక్షణం వ్యాట్ తగ్గియ్యకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని కేసీఆర్ ను హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ పరిధిలోని అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసనలు జరిగాయి. పెట్రోల్, డీజిల్​మీద కేంద్రం సెస్​ తగ్గించినా తమది ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న కేసీఆర్ మాత్రం వ్యాట్ తగ్గించలేదని బీజేపీ లీడర్లు మండిపడ్డారు. వికారాబాద్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానంద రెడ్డి ఆధ్వర్యంలో  కలెక్టరాఫీసు ముందు ధర్నా చేశారు. తర్వాత ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లబోగా పోలీసులకు, బీజేపీ నాయకులకు తోపులాట జరిగింది. చివరికి నాయకులు లోపలికి వెళ్లి కలెక్టర్ చాంబర్ ముందు నిరసన తెలిపారు. సదానందరెడ్డి, పలువురు లీడర్లను అరెస్టు చేశారు. నిజామాబాద్​లో జిల్లా పార్టీ ప్రెసిడెంట్​బస్వా లక్ష్మీనర్సయ్య ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాలోనూ అన్ని కలెక్టరేట్లను బీజేపీ లీడర్లు ముట్టడించారు. బీజేపీ స్టేట్​జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్‍లో నిరసనలు జరిగాయి. గద్వాల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ముందు బీజేపీ స్టేట్ లీడర్లు గడ్డం కృష్ణారెడ్డి, బండల పద్మావతి ధర్నా చేశారు.