- అదానీ గ్రూప్‌కి జేఏఎల్ అమ్మడంపై వేదాంత అనిల్ అగర్వాల్ గుస్స
- ఎన్‌సీలాట్‌లో అప్పీల్
న్యూఢిల్లీ: పవర్, సిమెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి వివిధ బిజినెస్‌లలో ఉన్న జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ (జేఏఎల్) ను దివాల పక్రియ (ఐబీసీ)లో తాము ముందు దక్కించుకున్నామని, ఇందుకు సంబంధించి కన్‌ఫర్మేషన్ లెటర్ కూడా అందుకున్నామని, కానీ తర్వాత కంపెనీని అదానీ గ్రూప్‌కు అమ్మారని మైనింగ్ కంపెనీ వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ అన్నారు. ఇన్సాల్వెన్సీ బిడ్డింగ్‌లో తమ కంపెనీని మొదట అత్యధిక బిడ్డర్‌గా ప్రకటించినప్పటికీ, ఆ నిర్ణయం తర్వాత మారిందని తెలిపారు. ‘‘జైప్రకాశ్ గ్రూప్ స్థాపకుడు జైప్రకాశ్ గౌర్ తన ఆస్తులు సరైన చేతుల్లోకి వెళ్లాలని కోరుకున్నారు. ఆ మాటలు వేలం సమయంలో మళ్లీ గుర్తుకు వచ్చాయి”అని అగర్వాల్ అన్నారు.
జేఏఎల్‌ను దక్కించుకునేందుకు అప్పులోళ్లకు (క్రెడిటార్ల కమిటీకి) వేదాంత సుమారు రూ.16 వేల కోట్లు ఆఫర్ చేసింది. కానీ, ఆరేళ్లలో ఇన్‌స్టాల్‌మెంట్‌లో తీరుస్తామని తెలిపింది. మరోవైపు అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ.14,535 కోట్లను ఆఫర్ చేసి, రూ.6 వేల కోట్ల అడ్వాన్స్ ఇచ్చేందుకు, రెండేళ్లలో మిగిలిన అమౌంట్ చెల్లించేందుకు ముందుకొచ్చింది. దీంతో క్రెడిటార్ల కమిటీ అదానీ ఆఫర్‌కు ఓకే చెప్పింది. అలహాబాద్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) బెంచ్ అదానీ ప్రణాళికను ఆమోదించగా, ఈ తీర్పును వేదాంత నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) లో అప్పీల్ చేసింది.
అగర్వాల్ మాట్లాడుతూ, “మాకు ఈ ఆస్తిపై ఎలాంటి అటాచ్‌మెంట్ లేదు. వస్తే దేవుని కృప, పోతే కూడా ఆయన సంకల్పం. కానీ ధర్మంలో ఇచ్చిన వాగ్దానం వెనక్కి తీసుకోవద్దు. గీతా చెప్పినట్టు, కోపం లేకుండా, అటాచ్‌మెంట్ లేకుండా ధైర్యంగా పని చేయాలి” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా, జేఏఎల్ వివిధ రంగాల్లో విస్తరించేందుకు భారీగా రుణాలు తీసుకుంది.
ఈ కంపెనీ అప్పులు సుమారు రూ.55 వేల కోట్ల దగ్గర ఉన్నాయి. ఎస్‌బీఐ, ఐడీబీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌ఐసీ ఎక్కువగా లోన్లు ఇచ్చాయి. అదానీ గ్రూప్ కొనుగోలుతో ఈ మొత్తం అప్పులో కేవలం 25–30 శాతం మాత్రమే రికవర్ అవుతుంది. మిగిలిన అప్పు రద్దు అవుతుంది. జేఏఎల్ పాత షేర్‌హోల్డర్లకు ఏం రాదు.
