యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరుడి ప్రతిమ

 యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరుడి ప్రతిమ

హైదరాబాద్, వెలుగు :  గ్రామ ప్రజల ధన, మాన, ప్రాణరక్షణ కొరకు శత్రువులతో పోరాడి, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరుడి ప్రతిమ మెదక్ జిల్లా శంకరంపేట మండలం జాంగ్రైలో సోమవారం వెలుగు చూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ ఈ వీరగల్లును గుర్తించారు. వీరుడి తల మీద రిబ్బను కట్టినట్లుగా కుడివైపు ఒరిగిన పెద్దసిగ, తల కట్టు, చెవులకు చక్ర కుండలాలు, మెడలో బిళ్లల హారం, దండరెట్టలకు కడియాలు, నుదుట బొట్టువంటి గుర్తు, పెద్దకండ్లు, వడి తిప్పిన మీసాలు, ట్రిమ్ చేసిన గడ్డం, నడుమున దట్టీ, ఒరలో పట్టా కత్తి, కత్తి పిడి మీద వీరుని కుడిచేయి, చేతులకు కంకణాలు, ఎడమ చేతిలో డాలు, కాలి వేళ్లకు మట్టెలు కనిపిస్తున్నాయి. వీరుడి ఆహార్యం, ఆయుధాలను బట్టి ఈ వీరగల్లు కాకతీయకాలానికి చెందినదని కావొచ్చని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్  హరగోపాల్ వెల్లడించారు.