వడగాల్పులకు మాడిపోతున్న  కూరగాయలు, పండ్లు

వడగాల్పులకు మాడిపోతున్న  కూరగాయలు, పండ్లు

ఎండ, వడగాల్పులకు మనుషులతో పాటు  కూరగాయలు, పండ్లు మాడిపోతున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే అన్నీ పాడై పోతున్నాయి. దీంతో వాటిని అమ్మకుండా పడేస్తున్నారు. పెట్టుబడి డబ్బులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు వ్యాపారులు.  ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం 10 గంటల తర్వాత జనం ఇంటి నుంచి బయటకు అడుగు పట్టే పరిస్థితి లేదు. కూరగాయలు, పండ్ల బిజినెస్ పైనా సమ్మర్ ఎఫెక్ట్ పడింది. ఎండ, వడగాలులకు కూరగాయలు, పండ్లు వాడిపోతున్నాయి. దీంతో వీటిని  కస్టమర్లు కొనడం లేదు. తక్కువ ధరకు ఇస్తామన్న కొనేందుకు ముందుకు రావడం లేదంటున్నారు వ్యాపారులు. స్కూల్స్, కాలేజీలకు సెలవుల వల్ల గిరాకీ తగ్గిపోయిందంటున్నారు. 

తోపుడు బండ్లను రోజువారిగా కిరాయికి తీసుకుంటారు కూరగాయలు, పండ్ల వ్యాపారులు. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల దగ్గర గిరిగిరికి తీసుకుంటారు. ఉదయం 850 రూపాయలు తీసుకుంటే, సాయంత్రం 1000 రూపాయలు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాపారం జరగకపోవడంతో పెట్టుబడి డబ్బులు రావడం లేదంటున్నారు వ్యాపారులు. పంటలను నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసినట్లు, స్ట్రీట్ వెండర్స్ కోసం కోల్డ్ స్టోరేజీలు నిర్మాణం చేయాలంటున్నారు వ్యాపారులు. దీనివల్ల పండ్లు,కూరగాయలు దెబ్బతినకుండా ఉంటాయంటున్నారు. ఈసారి పంట దిగుబడి తగ్గడం వల్ల కూరగాయల రేట్లు పెరిగాయంటున్నారు.  ఎండకాలం వెళ్లేదాక కష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు కూరగయలు, పండ్ల వ్యాపారులు.