రోడ్లపై పార్కింగ్ తో పెరిగిపోతున్న ట్రాఫిక్​

రోడ్లపై పార్కింగ్ తో పెరిగిపోతున్న ట్రాఫిక్​
  • సిటీలోని అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి
  • కార్లు, బైకులతో నిండిపోతున్న ఆఫీసులు, రెస్టారెంట్లు, షోరూంల ముందున్న రోడ్లు
  • పెరిగిపోతున్న ట్రాఫిక్​
  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాదచారులు 

హైదరాబాద్, వెలుగు : సిటీలో వెహికల్ పార్కింగ్ ఇష్టానుసారంగా మారింది. షాపులు, రెస్టారెంట్లు, హోటళ్లు, షోరూంల ముందున్న పార్కింగ్​స్థలం సరిపోక చాలా మంది కార్లు, బైకులను రోడ్లపైనే నిలుపుతున్నారు. ఫలితంగా ఆ రూట్లలో తీవ్రమైన ట్రాఫిక్​జామ్​అవుతోంది. పాదచారులకు కనీసం రోడ్ల వెంట నడిచేందుకు జాగా కూడా ఉండడం లేదు. పలుచోట్ల నో పార్కింగ్ బోర్డులున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇష్టమొచ్చినట్లు పార్క్​చేస్తున్నారు. ముఖ్యంగా కార్లతో చాలా ఇబ్బంది అవుతోంది. రాత్రిళ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి.పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ట్రాఫిక్​పోలీసులు చలాన్లు వేసి చేతులు దులుపుకుంటున్నారు. 

వీటితో ఇంకాస్త అధికం
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట, కూకట్ పల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ, మెహిదీపట్నం, లక్డీకాపూల్, తార్నాక, దిల్​సుఖ్​నగర్ ఇలా చాలా చోట్ల రోడ్ల మీదనే కార్లు, బైకులు పార్క్​చేస్తున్నారు. సిటీలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా, వెహికల్స్​కు ఉన్న రోడ్లు సరిపోవడం లేదు.  దీంతో మెయిన్​రోడ్లపై ట్రాఫిక్ సమస్య అధికం అవుతోంది. దీనికితోడు రోడ్ల మీద పార్క్​చేస్తున్న వెహికల్స్​సమస్యను మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా వానల టైంలో కిలో మీటర్లు మేర ట్రాఫిక్​నిలుస్తోంది. పంజాగుట్ట సర్కిల్​నుంచి కేబీఆర్​పార్క్​మెయిన్​గేట్​రూట్​లో పరిస్థితి దారుణంగా ఉంటుంది. స్టార్ హోటల్స్, షోరూంల ముందు నడిరోడ్డుపైనే కార్లు నిలుపుతున్నారు. ది బర్త్​ప్లేస్​హాస్పిటల్​వద్ద ఉన్న సిగ్నల్స్​నుంచి నుంచి కేబీఆర్ సిగ్నల్స్ వరకు ఇదే తీరున ఉంటున్నాయి. అలాగే బంజారాహిల్స్​తాజ్‌మహల్ హోటల్, స్టార్ బక్స్ హోటళ్ల ముందు ఏ టైంలో చూసినా ఇలాగే ఉంటోంది. సరిపడా పార్కింగ్​స్థలం లేక ఇలా రోడ్లపై నిలుపుతున్నారు. క్లాబ్​లలో వచ్చేవాళ్లు రోడ్ల మీదనే ఆపి దిగుతున్నారు. ఒక్క బంజారాహిల్స్​లో మాత్రమే కాదు సిటీలోని అన్ని ప్రధాన రోడ్లపై ఇదే సమస్య కొనసాగుతోంది. ఉదయం, సాయంత్రం టైంలో కేబీఆర్​పార్కు చుట్టూ కార్లు పార్క్​చేస్తున్నా ట్రాఫిక్​పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు.


ఫుట్​పాత్​లనూ వదలట్లేదు
పెద్ద పెద్ద స్టోర్లు తమ పార్కింగ్ కి ఫుట్‌పాత్‌లను వాడుకుంటున్నాయి. పాదచారులు వెళ్లేందుకు వీలులేక రోడ్డు యాక్సిడెంట్లకు గురవుతున్నారు. ఎటు నుంచి ఏ వెహికల్​వచ్చి ఢీకొడుతుందోనని బిక్కుబిక్కు మంటూ నడవాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు ఫుట్‌పాత్​ల ఆక్రమణలను పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు హడావుడి చేసి వదిలేస్తున్నారు. ఇదే అలుసుగా షాపుల ఓనర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. 

ప్రతిరోజూ టెన్షనే
నేను బంజారాహిల్స్ లోని ఒక కంపెనీలో పని చేస్తున్నాను. బస్టాప్ నుంచి ఆఫీసుకు కొంత దూరం నడవాల్సి ఉంటుంది. ఆ రూట్‌లో ఫుట్ పాత్‌లు సరిగా లేవు. రోడ్డు ఓ పక్కగా నడిచి వెళ్దామంటే అడ్డదిడ్డంగా కార్లు పార్క్​చేస్తున్నారు. దీంతో నడిరోడ్డుపై నడుస్తూ వెళ్తున్నాను. వెనుక నుంచి ఏ వెహికల్​వచ్చి గుద్దుతుందోనని భయం వేస్తుంది. 
– మానస, ప్రైవేట్ ఎంప్లాయ్, బంజారాహిల్స్

ఎవరూ పట్టించుకోవట్లే..
ఫొటోలు తీసి చలాన్లు వేస్తున్న ట్రాఫిక్​పోలీసులు ఇల్లీగల్​పార్కింగ్​పై చర్యలు తీసుకుంటే బాగుంటుంది. వానలకు రోడ్లపై ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడ్డాయి. వీటికి తోడు రోడ్లన్నీ కార్లు, బైకులతో నిండిపోతున్నాయి. బైక్​లేదా కారుతో ఇంటి నుంచి బయటికి వస్తే ముందుకు కదిలే పరిస్థితి ఉండడం లేదు. ఇష్టమొచ్చినట్లు రోడ్లు ఆక్రమించి పార్క్​చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు.
– సుమంత్, కూకట్​పల్లి