
రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు దినపత్రిక నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు నువ్వా నేనా అంటూ సాగుతున్నాయి. మూడోరోజు జరిగిన మ్యాచ్ ల వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబాబాద్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన వెలుగు టోర్నీని కలెక్టర్ శివలింగయ్య, ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ ప్రారంభించారు. తొలి మ్యాచ్ లో పాలకుర్తిపై మహబూబాబాద్ టీమ్ 34 రన్స్ తో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన మహబూబాబాద్ టీమ్ 19 ఓవర్లలో 132 రన్స్ చేయగా.. ఛేజింగ్ లో పాలకుర్తి టీమ్ 99 రన్స్ దగ్గరే ఆలౌట్ అయింది. మహబూబాబాద్ ప్లేయర్ గండి ప్రణయ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఇక రెండో మ్యాచ్ లోనూ పాలకుర్తి టీమ్ ఓటమి పాలైంది. డోర్నకల్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 85 రన్స్ కు ఆలౌట్ అయింది. 86 రన్స్ టార్గెట్ తో దిగిన డోర్నకల్ 14 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది.
కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల మధ్య వెలుగు టోర్నమెంట్ చివరి మ్యాచ్ జరిగింది. ఎల్లారెడ్డి టీమ్ పై కామారెడ్డి 47 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కామారెడ్డి 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 160 రన్స్ చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఎల్లారెడ్డి 113 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో 54 రన్స్ చేసి 2 వికెట్లు తీసిన కామారెడ్డి ప్లేయర్ అరవింద్ రెడ్డికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
జగిత్యాల జిల్లా మినీ స్టేడియంలో వెలుగు క్రికెట్ టో ర్నీ సెలక్షన్స్ జరిగాయి. కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు సెలక్షన్స్ లో ఆసక్తిగా పాల్గొన్నారు. దాదాపు 150 మంది క్రీడాకారులు హాజరుకాగా 60 మందిని సెలక్ట్ చేశారు. ఈ నెల 15న జరిగే టోర్నీలో మూడు నియోజకవర్గాల టీమ్ లు తలపడనున్నాయి.