బిల్డర్ నుంచి మంత్రిగా వేముల

బిల్డర్ నుంచి మంత్రిగా వేముల

నిజామాబాద్ జిల్లాకు చెందిన వేముల ప్రశాంత్ రెడ్డి 1968 మార్చి 14న జన్మించారు. తల్లిదండ్రులు వేముల సురేందర్ రెడ్డి, మంజుల. కర్ణాటక బాల్కి ఇంజనీరింగ్ కాలేజీలో బీఈ సివిల్ చదివారు. ప్రశాంత్ రెడ్డికి భార్య నీరజ రెడ్డి, ఇద్దరు కుమార్తెలు. మంచి బిల్డర్ గా హైదరాబాద్ లో పెరుపొందారు ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి చురుగ్గా పాల్గొన్నారు ప్రశాంత్ రెడ్డి. 2010లో బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు చేపట్టారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపును విజయవంతం చేయటంలో తనవంతు పాత్ర పోషించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో అందరికంటే ముందుగా ప్రశాంత్ రెడ్డి బాల్కొండ టికెట్ ప్రకటించారు కేసీఆర్. 2014లో బాల్కొండ నుంచి జిల్లాలోనే అత్యధికంగా 38వేల మెజారిటీతో విజయం సాధించారు. ప్రశాంత్ రెడ్డి పనితీరు మెచ్చిన కేసీఆర్.. మిషన్ భగీరథకు వైస్ చైర్మన్ గా క్యాబినెట్ హోదా కల్పించారు. ప్రశాంత్ రెడ్డి కృషితో రాష్ట్రంలో ఉన్న 24 వేల అవాసాలలో.. ప్రస్తుతం 23వేల అవాసాలకు మంచినీరు అందుతోంది. మొన్నటి ఎన్నికల్లో బాల్కొండ నుంచి రెండోసారి గెలిచారు. మిషన్ భగీరథ పథకం కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఇప్పుడు మంత్రిగా చాన్సిచ్చారు సీఎం కేసీఆర్.