పార్టీని వీక్ చేస్తున్న కొండా సురేఖను మంత్రిగా తొలగించాలి : వేముల వీరేశం

పార్టీని వీక్ చేస్తున్న కొండా సురేఖను మంత్రిగా తొలగించాలి : వేముల వీరేశం

Konda Surekha: పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ రాక్షస పాలనను ఎదిరించి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటంలో సీఎం రేవంత్ రెడ్డి కృషి ఎంతో ఉందని.. అలాంటి సీఎంను.. కాంగ్రెస్ పార్టీని చులకన చేస్తూ.. పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ విప్ వేముల వీరేశం. సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై..వ్యక్తిగతంగా విమర్శలు చేసిన మంత్రి కొండా సురేఖ కుమార్తె అంశంపై హైదరాబాద్  గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు.  

కుమార్తె చేసిన వ్యాఖ్యలతో సంబంధం లేదు అని కొండా సురేఖ అంటున్నారని.. తల్లికి తెలియకుండా బిడ్డ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందంటే ఎవరూ నమ్మరంటూ చెప్పుకొచ్చారు వేముల వీరేశం. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు.. మంత్రి కొండా సురేఖ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారాయన. ఏమైనా సమస్యలు ఉంటే పార్టీ అంతర్గతంగా చర్చించి పరిష్కరించుకోవాలని.. అలా కాకుండా బహిరంగ వేదికలపై విమర్శలు, ఆరోపణలు చేయటం ఏంటని నిలదీశారు విప్ వేముల వీరేశం. 

పదవిలో ఉంటూ సీఎంను విమర్శిస్తాను అంటే ఊరుకోం అని హెచ్చరించిన ఆయన.. కొండా సురేఖ వ్యాఖ్యలు ఎప్పుడూ పార్టీకి నష్టమే చేస్తున్నాయన్నారు. పనిగట్టుకుని ప్రభుత్వం, పార్టీపై విమర్శలు చేస్తున్నారంటూ కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ వేముల వీరేశం. పార్టీ క్రమ శిక్షణకు కట్టుబడి ఉండాలని.. గీత దాటితే ఊరుకునేది లేదని.. AICC చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారాయన. సొంత  పార్టీ నేతలు, ఎమ్మెల్యేలపైనే ఎంత అంటే అంత మాటలు అనటం ఏంటని ప్రశ్నించారాయన.