ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడి రోడ్డు ప్రమాదం కేసులో FIR వివాదం

ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడి రోడ్డు ప్రమాదం కేసులో FIR వివాదం

హైదరాబాద్ సిటీ నడిబొడ్డున.. హైటెక్ సిటీ సమీపంలో ఇనార్బిట్ మాల్ ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదం వివాదంగా మారింది. 2026, ఆగస్ట్ 16వ తేదీ సాయంత్రం యాక్సిడెంట్ జరిగిన తర్వాత నమోదు అయిన FIRపై ఇప్పుడు వివాదం నెలకొంది. దీనికి కారణం ఆ యాక్సిడెంట్ చేసింది ఏపీలో జనసేన పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న లింగమనేని రమేశ్ కుమారుడు లింగమని సంజూష్ కావటమే అని విమర్శలు వస్తున్నాయి. 

రోడ్డుపై కారు ఢీకొని ఓ యువతి చనిపోతే.. ఆ కేసులో నమోదు అయిన FIRలో సంజూష్ పూర్తి పేరు ఎందుకు నమోదు చేయలేదని విమర్శలు పోలీసులపై వస్తున్నాయి. సంజూష్ ఇంటిపేరు FIRలో ఎందుకు ప్రస్తావించలేదని ఆరోపణ వస్తున్నాయి. తండ్రి పేరు కూడా FIRలో నమోదు చేయకపోవడంపై ప్రశ్నలు వస్తున్నాయి. ఏపీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడిగా సంజూష్‌పై కేసు నమోదైనప్పటికీ.. FIRలో పూర్తి వివరాలు ఎందుకు లేవన్న చర్చ ఇప్పుడు నడుస్తుంది. 

ఓ రోడ్డు యాక్సిడెంట్ చేసి.. ఓ 20 ఏళ్ల యువతి మరణానికి కారణం అయిన నిందితుడి పూర్తి గుర్తింపు వివరాలు FIRలో లేకపోవటం ఏంటీ.. పోలీసులు నమోదు చేయకపోవడం ఏంటీ అనేది విమర్శలు వస్తున్నాయి. FIR నమోదు తీరుపై పలు అనుమానాలు వ్యక్తం కావటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. యువతి మృతి కేసులో పోలీసుల దర్యాప్తు తీరు ఏ విధంగా ఉందనేదానికి ఇదే నిదర్శనం అని.. సామాన్యులు యాక్సిడెంట్ చేస్తే ఇదే విధంగా వ్యవహరిస్తారా.. ఇదే విధంగా ప్రవర్తిస్తారా.. ఇదే విధంగా FIR నమోదు చేస్తారా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. FIRలో వివరాల నమోదు విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్లు వస్తున్నాయి. 

రోడ్డు యాక్సిడెంట్ తర్వాత లింగమనేని సంజూష్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు పోలీసులు. అందులో మద్యం తాగలేదని రిపోర్ట్ వచ్చింది. ఆ వీడియో 5 రోజుల తర్వాత బయటకు వచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించారా లేక తర్వాత నిర్వహించారా అనే చర్చ మొదలైంది ఇప్పుడు. యాక్సిడెంట్ సమయంలో కారు వేగం, డ్రైవింగ్ తీరుపైనా దర్యాప్తు చేస్తున్న పోలీసులు... CCTV ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు.