- రోడ్డు దాటుతున్న యువతిని కారుతో ఢీకొట్టిన ఎంపీ కుమారుడు
- ప్రమాదంలో యువతి మృతి.. కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు
- నిందితుడిని అరెస్ట్ చేయకుండా నోటీసులు ఇవ్వడంపై విమర్శలు
మాదాపూర్, వెలుగు: రోడ్డు దాటుతున్న యువతిని కారుతో ఢీకొట్టి ఆమె మృతికి కారణమైన జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్‌పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 16న ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒడిశాకు చెందిన భారతి ముఖి (26) తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
భారతి మాదాపూర్‌లో ఉంటూ ఇనార్బిట్ మాల్‌లోని ఓ స్టోర్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. ఈ నెల 16న మధ్యాహ్నం స్నేహితురాలు పూజతో కలిసి ఐటీసీ కోహినూర్ వైపు భోజనం కోసం వెళ్లింది. భోజనం తీసుకుని తిరిగి ఇనార్బిట్ మాల్ వైపు రోడ్డు దాటుతుండగా.. మాదాపూర్ వైపు నుంచి వేగంగా వచ్చిన కారు భారతిని ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు నడిపింది సంజూష్‌గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు తెలిపారు.
నోటీసులపైనే విమర్శలు
ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఎంపీ కుమారుడు కావడంతోనే పోలీసులు అరెస్ట్ చేయకుండా నోటీసులు ఇచ్చారంటూ మృతురాలి బంధువులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు. సామాన్య వ్యక్తి అయితే వెంటనే అరెస్ట్ చేసే పోలీసులు.. రాజకీయ నేత కుమారుడి విషయంలో మాత్రం నోటీసులతో సరిపెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
