- అక్కడి నుంచి దిగుమతులు అంతంత మాత్రమే
- చమురు అమెరికా కంట్రోల్లోకి వస్తే మన బకాయిలు వసూలుకు అవకాశం
న్యూఢిల్లీ: అపార చమురు నిల్వలు ఉన్న వెనెజువెలా ప్రెసిడెంట్నికొలస్ మదురో అరెస్ట్, తదనంతర పరిణామాలతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నా, ఇండియాపై ప్రభావం మాత్రం తక్కువేనని ఎక్స్పర్టులు చెబుతున్నారు. వెనెజువెలా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా చేసే ప్రధాన దేశం కావడంతో ఇతర దేశాలకు సమస్యలు ఉండవచ్చని అంటున్నారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనే అంశంపై గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) స్పందించింది. దీని రిపోర్ట్ ప్రకారం... ఈ సంక్షోభం కారణంగా భారత్ ఇంధన భద్రతకు గానీ ఆర్థిక వ్యవస్థకు గానీ పెద్దగా ముప్పు ఉండదు. భారత్ గత కొన్నేళ్లుగా వెనెజువెలా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులను గణనీయంగా తగ్గిస్తూ వస్తోంది. 2019లో అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆ దేశంతో వాణిజ్య కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. 2024-–25 ఆర్థిక సంవత్సరంలో వెనెజువెలా నుంచి భారత్ దిగుమతుల విలువ 364.5 మిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇందులో క్రూడ్ ఆయిల్ విలువ 255.3 మిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. 2023-–24 ఆర్థిక సంవత్సరంలో జరిగిన 1.4 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులతో పోలిస్తే ఇది 81.3 శాతం తక్కువ.
ఓఎన్జీసీకి బిలియన్ డాలర్ల బాకీ
వెనెజువెలా చమురు రంగం అమెరికా నియంత్రణలోకి వెళ్లడం వల్ల భారత్ కు భారీ ప్రయోజనం చేకూరవచ్చు. దీనివల్ల ఓఎన్‍జీసీ విదేశ్ లిమిటెడ్ (ఓవీఎల్) కు రావాల్సిన బిలియన్ డాలర్ల బకాయిలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఆంక్షలు సడలిస్తే ఆగిపోయిన చమురు ఉత్పత్తి మళ్లీ పెరగవచ్చు. ప్రస్తుతం రోజుకు 10 వేల బారెళ్లు ఉన్న ఉత్పత్తిని లక్ష బారెళ్లకు పెంచవచ్చని నిపుణులు భావిస్తున్నారు. భారత్ నుంచి వెనెజువెలాకు జరిగే ఎగుమతులు కూడా చాలా స్వల్పంగా ఉన్నాయి. గడిచిన ఏడాదిలో 95.3 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరగగా, అందులో ఫార్మా వాటా 41.4 మిలియన్ డాలర్లు ఉంది. తక్కువ వాణిజ్య సంబంధాలు, భౌగోళికంగా ఎక్కువ దూరం, ప్రస్తుతం ఉన్న ఆంక్షల నేపథ్యంలో వెనెజువెలా పరిణామాలు భారత్‍పై నేరుగా ప్రభావం చూపవని జీటీఆర్ఐ విశ్లేషించింది. భవిష్యత్తులో అక్కడ ఆంక్షలు సడలిస్తే భారత్ తిరిగి వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వెనెజువెలాలో లభించే హెవీ క్రూడ్ ఆయిల్‍ను శుద్ధి చేయడానికి భారతీయ రిఫైనరీలు సాంకేతికంగా అనుకూలం. ఆంక్షలు తొలగితే, వాణిజ్యం వేగంగా పుంజుకోవచ్చని కేప్లర్ విశ్లేషకుడు నిఖిల్ దూబే అన్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత పరిస్థితుల వల్ల సోమవారం మార్కెట్లు ప్రారంభమైనప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని లైవ్ మింట్ పేర్కొంది. వెనెజువెలాలో తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతలు మార్కెట్లలో అనిశ్చితిని పెంచుతాయని నిపుణులు భావిస్తున్నారు. క్రూడ్ ఆయిల్‍తో పాటు బంగారం, వెండి, రాగి, గ్యాసోలిన్ వంటి కమోడిటీల ధరలు కూడా పెరగవచ్చు. అమెరికా చర్యల వల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశం ఉన్నందున పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
