మదురో అరెస్ట్‌తో దూసుకెళ్లిన వెనిజులా స్టాక్ మార్కెట్.. ఒక్కరోజే 17 శాతం అప్.. ఎందుకిలా..?

మదురో అరెస్ట్‌తో దూసుకెళ్లిన వెనిజులా స్టాక్ మార్కెట్.. ఒక్కరోజే 17 శాతం అప్.. ఎందుకిలా..?

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బంధించినట్లు వెలువడిన సంచలన వార్తలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌పై అనూహ్య ప్రభావాన్ని చూపాయి. జనవరి 5న జరిగిన ఈ పరిణామం వెనిజులా భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో ఆశలను చిగురింపజేసింది. దశాబ్దాలుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆ దేశంలో రాజకీయ మార్పు వస్తుందనే అంచనాలతో 'కరాకాస్ స్టాక్ ఎక్స్ఛేంజ్' ఏకంగా 17 శాతం లాభపడి 2వేల597.7 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది గత కొన్నేళ్లలో ఒకే రోజు నమోదైన అతిపెద్ద పెరుగుదలగా నిలిచింది.

వాస్తవానికి వెనిజులా స్టాక్ మార్కెట్ పరిమాణం చాలా చిన్నది. 1947లో స్థాపించబడిన ఈ ఎక్స్ఛేంజ్‌లో కేవలం 15 కంపెనీలు మాత్రమే ట్రేడింగ్ అవుతున్నాయి. గత ఏడాది ఇక్కడ రోజువారీ ట్రేడింగ్ వాల్యూమ్ 1 మిలియన్ డాలర్ల కంటే తక్కువగానే ఉండేది. అయినప్పటికీ తాజా పరిణామాలు ఆ దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారబోతోందనే సంకేతాన్ని ఇచ్చాయి. కేవలం స్టాక్ మార్కెట్ మాత్రమే కాకుండా.. వెనిజులా సార్వభౌమ బాండ్లు, ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీ 'PDVSA' బాండ్లు కూడా భారీగా పుంజుకున్నాయి. దేశంలో పరిపాలన మారుతుందనే ఆశలతో.. ప్రస్తుతం అంతర్జాతీయ పెట్టుబడిదారులు వెనిజులా బాండ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

దీని వెనుక వెనిజులాలో నాయకత్వ మార్పు జరిగే వరకు అమెరికా పర్యవేక్షణ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన కూడా ఇన్వెస్టర్లలో కొత్త జోష్ నింపిందని తెలుస్తోంది. సీనియర్ అమెరికన్ అధికారులతో కూడిన బృందం ఆ దేశ పరిపాలనను, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ఫెసిలిటీల పునరుద్ధరణను పర్యవేక్షిస్తుందని తెలిపారు. అయితే వెనిజులా అప్పుల పరిష్కారం అంత సులభం కాదు. బాండ్లు, రుణాలు, కోర్టు తీర్పుల ద్వారా వెనిజులా దాదాపు 154 బిలియన్ డాలర్ల బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఒక శాశ్వత ప్రభుత్వం ఏర్పడే వరకు ఈ అప్పుల రీస్ట్రక్చరింగ్ సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రాజకీయంగా కూడా పరిస్థితి గందరగోళంగానే ఉంది. ఒకవైపు వెనిజులా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ సహకరిస్తారని అమెరికా భావిస్తుంటే.. మరోవైపు ఆమె అమెరికా చర్యలను "అనాగరికం" అని అభివర్ణించారు. మదురో తిరిగి అధికారంలోకి రావాలని ఆమె బహిరంగంగానే పిలుపునిచ్చారు. ఈ విరుద్ధ పరిణామాలు వెనిజులాలో రాజకీయ పరివర్తన అంత సులభంగా జరగకపోవచ్చని సూచిస్తున్నాయి. అయినప్పటికీ ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తున్న లెబనాన్, ఉక్రెయిన్ వంటి దేశాల తరహాలోనే వెనిజులా కూడా మళ్లీ పుంజుకుంటుందని పెట్టుబడిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మెుత్తానికి అధ్యక్షుడిని అమెరికా ఎత్తుకెళ్లాక స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకోవటం ప్రపంచ ఇన్వెస్టర్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.